మెగాస్టార్ చిరంజీవి 154వ సినిమా ఈరోజు సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. ఈ చిత్రానికి సక్సస్ ఫుల్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ భారీ చిత్రం పూజా కార్యక్రమం ఈ రోజు వేడుకగా జరిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమా ప్రారంభోత్సవంలో చిత్రబృందంతోపాటు సినీ ప్రముఖులు పాల్గొని టీమ్ కి అభినందనలు తెలియచేశారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ప్రారంభోత్సవం రోజునే ఈ మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
డైరెక్టర్ బాబీ చిరు ఫస్ట్ లుక్ పోస్టర్‌ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి ఊర మాస్ లుక్‌లో కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది. చిరు లుక్ చూసి అభిమానులు ఈలలు వేస్తున్నారు. మాస్ పూనకాలు మొదలాయే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మాస్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరు మత్స్యకారుడిగా మాస్ గెటప్‌లో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వీరాభిమాని తమ అభిమాన హీరోని డైరెక్ట్ చేస్తే.. ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.
డైరెక్టర్ బాబీ చిరు వీరాభిమాని కావడంతో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంటుందని మెగా అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. ఫస్ట్ లుక్కే అరాచకం అన్నట్టుగా ఉంటే.. ఇక సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డుల బద్దలుకొట్టడం.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.