మెగాస్టార్ చిరంజీవిని ఓ ఓటీటీ దిగ్గజం సంప్రదించిందా? మరి మెగాస్టార్ ఏమన్నారు? ఈ విషయాలను తెలుసుకుందాం. చాలా మంది స్టార్స్ ఇప్పుడు ఓటీటీ వైపు చూస్తున్నారు. ఓటీటీ కోసం ప్రత్యేకంగా సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇంకా తెలుగులో ఆ పరిస్థితి లేదు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ లాంటి వారంతా ఎవరికి వారు వారి వారి సినిమాల్లో బిజీగా ఉన్నారు. కానీ సీనియర్ నటుల దృష్టి మాత్రం ఓటీటీ పై ఉంది. అయితే వీరెవరూ ఓటీటీ సంస్థలను సంప్రదించలేదుగానీ ఓ ఓటీటీ దిగ్గజం మాత్రం మెగాస్టార్ తో ఓ ప్రాజెక్టు చేసేందుకు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం.
అయితే ఈ ప్రాజెక్టును చిరంజీవి తిరస్కరించినట్టు తెలుస్తోంది. గంట నిడివి గల ఓ వెబ్ చిత్రంలో ప్రధాన పాత్రకోసం చిరంజీవిని నటించమని అడిగారట. అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అయినా దాన్ని మెగాస్టార్ సున్నితంగా తిరస్కరించారట. అదే ఓటీటీ సంస్థ మరో సారి ఓ వెబ్ సిరీస్ కోసం మళ్లీ చిరంజీవితో చర్చలు ప్రారంభించింది. ఈ అవకాశాన్ని కూడా చిరంజీవి వదులుకున్నారట.
దీనికి భారీ పారితోషికాన్ని ఆశ చూపినా చిరంజీవి ఏ మాత్రం మొగ్గుచూపలేదని సమాచారం. తెలుగు పరిశ్రమలో వెంకటేష్, నాగార్జున లాంటి ఇతర హీరోలు ఓటీటీలోకి వెళ్లడానికి సుముఖంగా ఉన్నారు. చిరంజీవి మాత్రం దీనికి దూరంగా ఉండదలుచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి చేతిలో పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. అవి పూర్తయితే తప్ప ఆయన బయటికి రాలేరు. ఆ తర్వాత మళ్లీ ఓటీటీ అవకాశాలు వస్తే ఆలోచిస్తారేమో చూడాలి.











