ఎంపీ రఘురామరాజును వెంటనే రమేష్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలని నిన్నరాత్రి హైకోర్టు ప్రత్యేక డివిజన్ బెంచ్ ఆదేశించినా సీఐడీ అధికారులు పట్టించుకోలేదు.హైకోర్టు తీర్పు కాపీని రఘురామరాజు తరఫు న్యాయవాదులు రాత్రి 12 గంటలకే జైలు అధికారులకు అందజేశారు.సీఐడీ అధికారులకు ఫోన్లు చేసినా వారు లిఫ్ట్ చేయలేదని ఎంపీ తరఫు న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు.కొందరు సీఐడీ అధికారులు ఫోన్లు ఎత్తి హలో, హలో అంటూ ఏమీ వినపడనట్టు పెట్టివేశారని,వారికి వాట్సాప్‌లో కూడా కోర్టు ఆర్డరు కాపీ పంపినట్టు న్యాయవాది లక్ష్మీనారాయణ వెల్లడించారు.సీఐడీ అధికారులు చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే ఇలా చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ
ఎంపీ రఘురామరాజు బెయిల్ వ్యవహారం ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.మరో వైపు సీఐడీ అధికారులు హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తారా? లేదా? అనేది కూడా వేచి చూడాల్సి ఉంది.హైకోర్టు ఆదేశాలు దిక్కరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రఘురామరాజు తరఫు న్యాయవాదులు చెబుతున్నారు.అయితే కావాలనే ఆలస్యం చేస్తున్నారని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.నిన్న హుటాహుటిన రఘురామరాజును జైలుకు తరలించారని, కనీసం జైలు ప్రొసీజర్స్ కూడా పాటించలేదని న్యాయవాది లక్ష్మీనారాయణ తెలిపారు.రఘురామరాజును ఇప్పుడు రమేష్ ఆసుపత్రికి తరలించడం సాధ్యం కాదని పోలీసులు చెబుతున్నారని తెలుస్తోంది.అదే జరిగితే కోర్టు దిక్కరణ ఎదుర్కోవాల్సి ఉంటుందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.
Must Read ;- RRR కేసు: ముగిసిన వాదనలు.. వైద్య పరీక్షల పరిశీలన తరవాత తుది తీర్పు











