సినిమా థియేటర్లు డిసెంబర్ 4 నుంచి తెరచేవిధంగా యాజమాన్యాలు చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు సోమవారం జీవో జారీ చేయడంతో ఎగ్జిబిటర్లలో ఆనందం వ్యక్తమైంది. కొత్త సినిమాలను విడుదల చేసుకునే నిర్మాతలకు ప్రచారంతో పాటు పోస్టర్ ప్రింటింగ్ వంటి వాటికి సౌకర్యవంతంగా ఉండటం కోసం కనీసం పదిరోజుల తర్వాతే థియేటర్లను ఓపెన్ చేస్తే బావుంటుందని యాజమాన్యాలు భావిస్తున్నాయి.
ఆ మేరకు డిసెంబర్ 4 నుంచి ప్రారంభించాలని వారు అనుకుంటున్నారు. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తే థియేటర్లను ఎప్పడు తెరవాలన్న అంశంపై ఇటీవల ఎగ్జిబిటర్ల అసోసియేషన్లు సమాలోచనలు జరిపాయి కూడా. సోమవారం జీవో రావడంతో రెండు, మూడు రోజులలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్లు సమావేశమై, దానికి కొందరు నిర్మాతలను కూడా పిలిచి, థియేటర్లు ఓపెన్ చేసే తేదీని అధికారికంగా ప్రకటిస్తామని అసోసియేషన్ నాయకులు అంటున్నారు. బహుశా డిసెంబర్ 4వ తేదీకే అధికశాతం అవకాశం ఉందని వారు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన రాయితీలు చిన్న నిర్మాతలకు ఆశాజనకంగా ఉన్నాయని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ సెక్రటరీ విజయేందర్ రెడ్డి తెలియజేస్తూ, థియేటర్ యజమానులు అడుగుతున్నడిమాండ్లలో కరెంటు రాయితీ ఇవ్వడం ఆనందదాయకం అని చెప్పారు. మరో రెండు ముఖ్యమైన డిమాండ్లు నెరవేరలేదని ఆయన పేర్కొన్నారు. పార్కింగ్ ఫీజు వసూలు, మెయింటైన్ చార్జీని మూడు రూపాయల నుంచి ఆరు రూపాయలకు పెంచమని కోరుతున్నామని, అయితే వాటికీ పరిష్కారం లభించలేదన్నారు. ఏది ఏమైనా చిత్ర పరిశ్రమలోని చిన్న నిర్మాతలకు ప్రయోజనం చేకూరినా అది తమకు పరోక్షంగా సినిమా ప్రదర్శనను మరింత పొడిగించుకునే సౌలభ్యం ఈ రాయితీల వాళ్ళ కలుగుతుందని ఆయన చెప్పారు.
Must Read ;- కేసీఆర్ కు మెగాస్టార్ చిరంజీవి కృతఙ్ఞతలు











