(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం కిష్టుపురం పంచాయతీ పరిధిలోని బలరాంపురంలో మంగళవారం మరోమారు టీడీపీ, వైసీపీ గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన సుమారు 150 మంది గాయపడినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలికి హుటాహుటిన పోలీసులు చేరుకుని అక్కడున్నవారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులో ఉంచారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
గతంలోనూ..
కిష్టుపురం పంచాయతీ పరిధిలోని బలరాంపురంలో గతంలోనూ ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ సానుభూతి పరుల ఇళ్లపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కిష్టుపురం సర్పంచ్‌గా వైసీపీ మద్దతుదారుడు వెంకటరావు విజయం సాధించారు. ఈ పంచాయతీలోని పది వార్డులకు ఆరు వార్డులను టీడీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన మోహనరావుకు ఉప సర్పంచ్ పదవి ఇచ్చారు. గతంలో వైసీపీ ఉప సర్పంచ్‌గా ఉన్న ధర్మారావుకు పదవి ఎందుకు ఇవ్వలేదని ఆ వర్గీయులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలోనే టీడీపీ సానుభూతి పరుల ఇళ్లపై దాడి చేశారు. ఈ దాడిలో కైలాసరావు, నవీన్‌కు తీవ్ర గాయాలు కాగా శ్రీకాకుళం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు రెండు రోజుల క్రితం టీడీపీ సానుభూతి పరులను పరామర్శించి అన్ని వేళలా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. మంగళవారం మరోమారు ఘర్షణ చోటు చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Must Read ;- పల్నాడులో వైసీపీ నేతల అరాచకం, కిడ్నాపులు, బెదిరింపులు











