గుంటూరు జిల్లా పల్నాడులో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా బెదిరింపులు, కిడ్నాప్ లకు పాల్పడుతున్నారు. పోలీసులు కూడా అధికారపార్టీ నేతలకు పూర్తిగా సహకరించడంతో పల్నాడులో ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయి. కడప జిల్లా తరవాత పల్నాడులోని గురజాల, మాచర్లలో ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగాయి. నాలుగోవిడత నామినేషన్ల ప్రక్రియ కూడా ముగియనుండటంతో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను బెదిరించడం, కిడ్నాప్ చేయడంలాంటి కార్యక్రమాలు ఎక్కువయ్యాయి. తాజాగా గురజాల నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి, బెదిరించి తరవాత వదిలేశారు. మాట వినకపోతే అక్రమ మద్యం కేసులు పెడతామని పోలీసులు వేదిస్తున్నారని అభ్యర్థులు టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
పల్నాడులో వైసీపీ నేతల ఇష్టారాజ్యం..
మాచర్ల నియోజకవర్గంలో 36 గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. వీటి సంఖ్య మరికొంత పెరిగే అవకాశం కూడా ఉంది. నామినేషన్లు దాఖలు, ఉపసంహరణకు మరో రెండు రోజులు సమయం ఉండటంతో నామినేషన్లు వేసిన టీడీపీ బలపరిచిన అభ్యర్థులు గుంటూరు చేరుకుంటున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక ప్రచారంలో పాల్గొనాలని టీడీపీ బలపరిచిన అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులను రంగంలోకి దింపుతున్నారు. టీడీపీ బలపరిచిన అభ్యర్ధులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిళ్లు తీసుకువస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక గురజాల నియోజకవర్గం కరాలపాడు, పందిటివారిపాలెంలో టీడీపీ బలపరిచిన అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకున్నారు అయ్యప్పనగర్‌లో అధికారపార్టీ తప్ప మరొకరిని నామినేషన్ వేయనీయలేదు. బ్రాహ్మణపల్లిలో తెలుగుదేశం బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి భర్తను మద్యం కేసులో సంబంధం లేకపోయినా పోలీస్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులు బెదిరింపులకు దిగారని తెలుస్తోంది. నామినేషన్ ఉపసంహరించుకోకపోతే అక్రమ మద్యం కేసు పెడతామని పోలీసులు బెదిరింపులకు దిగుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
కిడ్నాప్ చేసి వదిలేశారు..
పల్నాడులో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను వైసీపీ నేతలు కిడ్నాప్ చేసి నామినేషన్ల ప్రక్రియ ముగిశాక వదిలేస్తున్నారు.బ్రాహ్మణపల్లిలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి శివయ్యను ముందుగా పోలీసులు స్టేషన్ కు తీసుకెళ్లారు. స్టేషన్ కు వచ్చిన వైసీపీ నేత చంద్రారెడ్డి, శివయ్యను జీపులో ఎక్కించుకుని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. నామినేషన్ల ప్రక్రియ ముగిశాక శివయ్యను వదిలేశారు. టీడీపీ నేతలపై బెదిరింపులకు దిగడంతో పల్నాడులో చాలా గ్రామాల్లో ఏకగ్రీవాలు చోటుచేసుకున్నాయనే విమర్శలు వస్తున్నాయి. కేవలం బెదిరింపులు, కిడ్నాప్ లకు పాల్పడం ద్వారా జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్ ఈ సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
నివురుగప్పిన నిప్పులా పల్నాడు..
పల్నాడులో స్థానిక ఎన్నికల నేపథక్యంలో ఫ్యాక్షన్ భూతం మరోసారి పడగవిప్పేలా ఉంది. పెదగార్లపాడులో మాజీ సర్పంచ్ అంకులు హత్య తరవాత ప్రాణభయం ఉన్న టీడీపీ నేతలు గుంటూరులో నివాసం ఉంటున్నారు. ఇక పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వారంతా వారి గ్రామాల్లో సంచరిస్తున్నారు. ఈ సమయంలో ప్రత్యర్థులు దురాగతాలకు పాల్పడే ప్రమాద ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని టీడీపీ నాయకులు విజ్ఙప్తి చేస్తున్నారు. పల్నాడులో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. అయితే సమస్యాత్మక గ్రామాల్లో ఏకగ్రీవాలు జరగడంతో కొంత వరకు హింసకు తావు లేకుండా పోయిందని తెలుస్తోంది.
Must Read ;- కోస్తా జిల్లాల్లో సత్తా చాటిన టీడీపీ.. వైసీపీ నేతల్లో కలవరం