( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
‘ప్రధానమంత్రి మోదీ కాళ్లు పట్టుకుంటావో.. కొరువు దండాలు పెడతావో.. తెలియదు కానీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాల్సిన బాధ్యత నీదే’ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గాజువాకలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా జగన్ వ్యవహారశైలిపై నిప్పులు చెరిగారు.
రాష్ట్రమంతా ఉద్యమంతో ఊగిపోతూ ఉంటే.. ఇంటి గుమ్మం దాటకుండా కేంద్రానికి లేఖ రాశానని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. ఇంతవరకు ముఖ్యమంత్రి నేరుగా ప్రకటన చేయకపోవడం ఐదు కోట్ల మందిని అవమానించడమే అన్నారు. పోస్క తో గతంలోనే ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం కాదా అని?… ఈ కుట్రలో మీకు భాగస్వామ్యం లేదా అని.. ప్రశ్నించారు. పైకి ఒకల లోపల మరోలా ప్రవర్తిస్తే ప్రజలు గమనించలేరని అనుకోవద్దని హితవు పలికారు.
పోస్కో ప్రతినిధులను ఒడిశాలోని గిరిజనులు తరిమి కొడితే.. అటువంటి దిక్కుమాలిన కంపెనీకి మన రాష్ట్రంలో చోటిస్తావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సహకారంతోనే వారు ఇక్కడకు వచ్చారని నాయుడు విమర్శించారు. ” నువ్వు ఢిల్లీ వెళుతున్నది ప్రజల కోసం కాదు.. ఇక్కడ సమస్యలపైన చర్చించేందుకు కాదు.. కేసుల కోసం కాళ్లు పట్టుకునేందుకే వెళుతున్నావు” అని విమర్శించారు. ముఖ్యమంత్రిగా చేసిన తప్పులకు లెంపలు వేసుకొని ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి నాయకత్వం వహించాలని డిమాండ్ చేశారు. అంత మంది ఎంపీలు ఉండి ఏం సాధించావు అని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ వద్దని రాసిన లేఖను అక్కడ ఎవడు పట్టించుకుంటాడు? లేఖ రాస్తే బాధ్యత తీరిపోతుందా అని నిలదీశారు. అయిదు కోట్ల ఆంధ్రులు సపోర్ట్ చేయాలని.. ప్రాంతాలకు అతీతంగా ఉద్యమంలో పాల్గొనాలని ప్రజలకు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.
Must Read ;- స్టీల్ ప్లాంట్ ను తల్లిలా కాపాడుకుంటాం











