ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇప్పటికే రాజధాని అమరావతి పనులను స్పీడప్ చేసిన ఆయన..రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చే విషయంలో విశేష కృషి చేస్తున్నారు. దావోస్ పర్యటన గానీ..అందివచ్చిన ఏ అవకాశాన్ని చంద్రబాబు వదలడం లేదు. పక్కా విజన్‌తో ముందుకు సాగుతున్నారు. పేరొందిన వ్యాపారవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తూ ఏపీలో పెట్టుబడులు పెట్టాలని, అందుకు గల అవకాశాలను, ప్రభుత్వం తరపున ఇచ్చే ప్రోత్సాహకాల గురించి వివరిస్తున్నారు.
ఇక తాజాగా సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు DRDO మాజీ ఛైర్మన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ జి.సతీష్ రెడ్డి. రాష్ట్రంలో 50 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించేలా సహకారమందిస్తానని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధికి ఉన్న అవకాశాలు, ప్రధానంగా రక్షణ రంగంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఉన్న అవకాశాలపై ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు.
సతీష్ రెడ్డి ఇచ్చిన ప్రజంటేషన్‌పై హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకొచ్చినా స్వాగతిస్తామన్నారు చంద్రబాబు. వేగంగా అనుమతులివ్వడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు, భూకేటాయింపులు చేస్తామని సతీష్ రెడ్డికి హామీ ఇచ్చారు.