ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మంచి రోజులు మొదలయ్యాయి. గత వైసీపీ హయాంలో ఎలాంటి పెట్టుబడులు రాకపోవడంతో ఉద్యోగాలు లేక యువత అల్లాడింది. ఐతే ఇప్పుడు పరిస్థితులు మారాయి. విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఐటీ కంపెనీలు క్యూ కడుతున్నాయి. గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు వాటి కేంద్రాలను విశాఖలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఈ మేరకు ఆయా సంస్థలతో చర్చలు జరిపారు. డేటా సెంటర్, గ్లోబల్ బిజినెస్ సెంటర్, ఏఐ డెవలప్‌మెంట్ సెంటర్, చిప్ తయారీ కేంద్రం, గ్లోబల్ కేపబులిటీ సెంటర్ వంటివి ఏర్పాటు చేయాలని సంబంధిత సంస్థలను కోరారు. ఈ నేపథ్యంలో ఆయా కంపెనీల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం VMRDAకు చెందిన ఐకానిక్ బిల్డింగ్స్‌ను రెడీ చేస్తున్నారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో సీఎం చంద్రబాబు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
విశాఖ సెంటర్‌లో 1.72 ఎకరాల విస్తీర్ణంలో షిప్ ఆకారంలో రూ.87 కోట్ల 50 లక్షల వ్యయంతో 11 అంతస్తుల్లో ఈ బిల్డింగ్ నిర్మిస్తున్నారు. ఐదు అంతస్తుల్లో లక్షా 90 వేల చదరపు అడగుల స్థలాన్ని పార్కింగ్‌కు, మిగిలిన ఆరు అంతస్తుల్లోని లక్షా 65 వేల చదరపు అడుగులను ఆఫీసు అవసరాలకు వినియోగించనున్నారు. ఈ బిల్డింగ్‌ను పార్కింగ్‌తో పాటు అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఏకకాలంలో 430 కార్లు, 400 ద్విచక్రవాహనాలు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
గ్లోబల్ కేపబులిటీ సెంటర్, డేటా ఇంక్యుబేషన్ సెంటర్లకు వీలుగా సువిశాల ప్రాంగణాలు సిద్ధంగా ఉండడంతో ఈ భవనం మొత్తాన్ని మల్టీ నేషనల్ కంపెనీలకు కేటాయించాలనే ఆలోచన చేస్తున్నారు.
వెంటనే ఆఫీసు ఓపెన్ చేసి, యువతకు ఉపాధి కల్పించే పేరున్న సంస్థ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. సిటీ మధ్యలో ఉండడంతో ప్రముఖ సంస్థలు వస్తే ఓ బ్రాండ్ ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. దావోస్ నుంచి చంద్రబాబు తిరిగిరావడంతో ఈ బిల్డింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది.











