Power Production Stopped At Nagarjuna Sagar :
రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా నీటి వినియోగంపై వివాదం జరుగుతున్న నేపథ్యంలో ఎట్టకేలకు తెలంగాణ జెన్‌కో ఈ రోజు నాగార్జునసాగర్‌లో విద్యుత్తు ఉత్పత్తిని నిలిపివేసింది. గత నెల 29 నుంచి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి11 రోజుల్లో 30 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేశారు. ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారి తీసింది. ప్రాజెక్టులో నీళ్లు తక్కువగా ఉన్నప్పటికీ తెలంగాణ జలవిద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏ పీ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా నిబంధనల మేరకు తగిన నీటి నిల్వలు లేనప్పటికీ తెలంగాణ జెన్ కో విద్యుత్తు ఉత్పత్తి చేయడంతో సాగుకు, తాగేందుకు ఉపయోగపడాల్సిన నీరు సముద్రం పాలవుతోందని కేఆర్‌ఎంబీతోపాటు కేంద్ర జలశక్తి శాఖకు ఏపీ లేఖలు రాసింది. శ్రీశైలంలో గరిష్ఠమట్టాలకు నీరు చేరకూడదనే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని ఏపీ వాదిస్తోంది.
తమ వాటానే వాడుకుంటున్నామన్న తెలంగాణ
మరోవైపు తమకు కేటాయించిన నీటినే వాడుకుంటున్నామని తెలంగాణ వాదిస్తోంది. అంతేగాక నాగార్జునసాగర్, పులిచింతల వద్ద పోలీసు బలగాలను మొహరించి మరి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసింది. మరోవైపు ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మొత్తానికి ఈ రోజు సాగర్ లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసింది.
ఈ వివాదం సహా కృష్ణా జలాల కేటాయింపులపై ఈ నెల 24న కేఆర్ఎంబీ పూర్తి స్థాయి సమావేశంలో చర్చించనున్నారు.
సీఎంల తీరుపై విమర్శలు
కృష్ణా జలాల వివాదంపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీం జగన్ లు వ్యవహరిస్తున్న తీరుపై కూడ పలు విమర్శలొచ్చాయి. విందులు చేసుకున్నఇద్దరు సీఎంలు రెండు నిముషాలు కూర్చుని చర్చించుకుని సమస్యను పరిష్కరించుకోలేరా అంటూ ఇటీవల తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల అన్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో సెంటిమెంట్ తో లబ్ధి పొందేందుకే కేసీఆర్ కృష్ణా జలాల వివాదాన్ని తెరపైకి తెచ్చారని బీజేపీ ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఉప ఎన్నికలు అయ్యేంత వరకు ఆ వివాదం అలాగే ఉంటుందని, అది ఇద్దరు సీఎంల మ్యాచ్ పిక్సింగ్ అని కూడ ఆ పార్టీలు అంటున్నాయి.
Must Read ;- ఈ లెక్కలన్నీ వాళ్లే చెప్పేశారండీ