ఏపీ, తెలంగాణల మధ్య నెలకొన్న కృష్ణా నదీ నీటి వివాదం ఇప్పుడు ‘పవర్ పంచాయితీ’గా మారింది. అనుమతి లేకుండా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న జల విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలిపి వేయాలని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డుకు వరుసగా మూడోసారి లేఖ రాసింది.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులోని నీటిని వినియోగిస్తోందంటూ ఏపీ ప్రభుత్వం మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. కేటాయింపులతో సంబంధం లేకుండానే జూన్ 1 తేదీ నుంచే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగిస్తోందని కేఆర్ఎంబీకి ఏపీ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు సుమారు 6.9 టీఎంసీల నీటిని ఉపయోగించారని పేర్కొంటూ కృష్ణ రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యకార్యదర్శికి ఏపీ ఈఎన్‌సీ నారాయణ రెడ్డి లేఖ రాశారు. ఇప్పటికే ఈ అంశంపై రెండుసార్లు లేఖ రాసినా కేఆర్ఎంబీ పట్టించుకోలేదని ఆయన పేర్కొన్నారు.
40 శాతం వినియోగించుకుంటున్న తెలంగాణ
ఎగువ నుంచి 17.36 టీఎంసీల మేర నీటి ప్రవాహాలు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తుంటే, అందులో 40 శాతం నీటిని తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటోందని లేఖలో పేర్కొన్నారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నుంచి అనుమతులు లేకుండానే తెలంగాణ సర్కార్ ఏక పక్షంగా నీటిని వినియోగించటం సరికాదన్నారు. నీటి వినియోగాన్ని నిలుపు చేసేలా తెలంగాణ అధికారులను ఆదేశించాలంటూ కేఆర్ఎంబీని ఏపీ ప్రభుత్వం లేఖలో కోరింది.
నాగార్జున సాగర్ డ్యాం వద్ద భద్రతా ఏర్పాట్లు
శ్రీశైలం డ్యాంలో కనీస నీటి మట్టం 834 అడుగులకు పైగా ఉప్పుడు మాత్రమే విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది. తెలంగాణ జెన్కో ఉన్నతాధికారులు మాత్రం తెలంగాణ ప్రాంతంలో ఉన్న జల విద్యుత్ కేంద్రాలలో నూటికి నూరు శాతం విద్యుత్తును ఉత్పత్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో శ్రీశైలం ప్రధాన జలవిద్యుత్ కేంద్రం వద్ద కొంతమేరకు ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నందున ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదాలు జరగుతున్న నేపథ్యంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద జిల్లా ఎస్పీ రంగనాథ్ సారధ్యంలో సెక్యూరిటీ పెంచారు, జిల్లా హెడ్ క్వార్టర్స్ నుండి 200 పైన ప్రత్యేక దళాలు, ప్రత్యేక పోలీసు సిబ్బంది, ఐదుగురు సీఐలు, ఇద్దరు డీఎస్పీలు సాగర్ ప్రాజెక్టు వద్ద మోహరించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఎస్పీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం, ప్రధాన డ్యామ్ వద్ద ఎస్పీఎఫ్‌తో పాటు ప్రత్యేక భద్రతా దళాలతో సెక్యూరిటీని పెంచారు.
Must Read ;- మంత్రుల ‘నీటి’ మాటలు హుజురాబాద్ ఓట్ల కోసమే : ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య