‘మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ.. మాట్లాడే స్వేచ్ఛ ఎక్కువ..చాలా మంది చాలా మాట్లాడతారు. అదిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. 125 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టీ మాది..’ ఈ మాటలు కాంగ్రెస్ పార్టీ లీడర్ల నుంచి తరచూ వింటుంటాం..ఏ పదవి కోసమైనా.. ఆ పార్టీలో రచ్చ జరగాల్సిందే. అది పార్టీని మరింత దిగాజర్చుతుందని తెలిసినా.. మార్పు ఉండదు.
కేడర్‌పై ప్రభావం
తాజాగా టీపీసీసీ కోసం పార్టీలో రచ్చ నడుస్తోంది. పార్టీ నిర్ణయాలు వారి అంతర్గత వ్యవహారమే అయినా వారు తీసుకునే నిర్ణయాలు ఆ పార్టీ కేడర్‌పై ప్రభావం చూపుతాయి. రానున్న కాలంలో ఆ పార్టీకి ఓటర్లు ఓటు వేయాలో వద్దో నిర్ణయించుకునేందుకు కూడా ప్రధానాంశంగా మారతాయి. గతంలో ఉమ్మడి ఏపీలో ఆ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ప్రజలను అవమానించేలా ఉండడంతోనే.. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో టీడీపీ ఏర్పాటైంది. అది చరిత్ర. అప్పటి నుంచి కాంగ్రెస్ కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నా..పార్టీలో నాయకులను ఏకతాటిపైకి తేవడంలో మాత్రం చాలాసార్లు నాయకత్వాలు విఫలం అవుతున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల తరవాత పార్టీకి జాతీయ స్థాయిలో నాయకత్వ సమస్య కూడా ఏర్పాటైంది. తెలంగాణలోనూ ప్రస్తుతం అదే పరిస్థితి. కొన్నాళ్లుగా టీపీసీసీ మార్పు అంశంపై చర్చ నడుస్తోంది. హుజూర్‌నగర్ ఉప ఎన్నికకు ముందే ఈ చర్చ మొదలైంది. ఇక జీహెచ్ఎంసీ ఫలితాల తరువాత ప్రస్తుత టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ రాజీనామాతో మరోసారి చర్చ మొదలైంది. పార్టీ లీడర్లలోనూ కుమ్ములాటలు, బహిరంగ స్టేట్ మెంట్లు మొదలయ్యాయి.
చర్చలే చర్చలు..
పీసీసీ చీఫ్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణికం ఠాగూర్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లు కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లీడర్ల ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. ఆ ప్రయత్నాలు చేయడాన్ని ఎవరూ కాదనరు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు అడిగే హక్కు ఉంటుంది. అయితే ఆ క్రమంలో ఇతర నాయకులతో తెచ్చుకుంటున్న విభేదాలు, పార్టీకి పంపిస్తున్న హెచ్చరికలు ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం ఏర్పడేందుకు కారణం అవుతున్నాయి.
రేసులో వీరు..
పార్టీ వర్గాల్లో ఉన్న ప్రచారం ప్రకారం టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు ఉన్నారు. పార్టీ తమకు అప్పగిస్తే తీసుకునేందుకు జీవన్‌రెడ్డి కూడా రెఢీగానే ఉన్నారు. ఇక తాను కూడా రేసులో ఉన్నానని జగ్గారెడ్డి ఇంతకు ముందే చెప్పారు. సీనియర్ లీడర్లైన మర్రి శశిధర్ రెడ్డి, గీతారెడ్డి లాంటి వారూ రేసులోనే ఉన్నారు. మరోవైపు తానే అందరి కంటే సీనియర్‌ని అని, పార్టీకి విధేయులకే ఇవ్వాలని మరో సీనియర్ నేత వీహెచ్ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో సామాజిక కోణాన్ని కొందరు తెరపైకి తెస్తున్నారు. అయితే వీరిలో కొందరు.. తమకు పీసీసీ కాకుండా వేరే వారికి ఇస్తే తాము తమ దారి చూసుకుంటామని అంతర్గతంగా హెచ్చరికలు చేస్తుండడమే ప్రధాన సమస్యగా మారింది. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడతామని పైకి చెబుతూనే..తమకంటే అర్హత ఉన్నవారెవరు అనే ప్రశ్నకూడా లేవెనెత్తుతున్నారు.
ఆత్మపరిశీలన ఏదీ..
ఇప్పటికే వరుస వైఫల్యాలతో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ కాంగ్రెస్‌కు జీవం పోసే లీడర్లు ప్రస్తుతం అవసరం. ఓటర్లను ఆకట్టుకోవడంలో ఎక్కడ విఫలం అవుతున్నాం.. విధానపరమైన నిర్ణయాల్లో ఉన్న లోపాలేంటి.. రానున్న కాలంలో అమలు చేయాల్సిన వ్యూహాలేంటి..పార్టీ ఓటమికి దారి తీసిన పరిస్థితులేంటి..అనే అంశంపై చర్చ జరగా ల్సిన ఈ పరిస్థితుల్లో పీసీసీ కోసం కుమ్ములాటలు జరుగుతున్నాయి. ఈ పరిణామాలు ప్రజలకు, ఓటర్లకు, పార్టీ కేడర్‌కి ప్రతికూల సంకేతాలుగా మారే ప్రమాదం కూడా ఉంది. అదే జరిగితే పార్టీ మరింత పాతాళానికి వెళ్లి పోతుంది.
సమ ఉజ్జీ ఉంటేనే..
తెలంగాణ ఏర్పాటయ్యాయక టీడీపీని కేసీఆర్ దెబ్బ తీశాక.. 2019 లోక్‌సభ ఎన్నికల వరకు కాంగ్రెస్‌కు జాతీయ స్థాయిలో బీజేపీ, తెలంగాణ స్థాయిలో టీఆర్‌ఎస్‌లు మాత్రమే రాజకీయ ప్రత్యర్థులు అనే అభిప్రాయం ఉండేది. జాతీయ స్థాయిలో ఆ పార్టీ బీజేపీని ఎదుర్కొని, రాష్ట్ర స్థాయిలో టీఆర్ఎస్‌ను ఎదుర్కొంటే సరిపోతుందనే అభిప్రాయం ఉండేది. ఇటీవలి కాలంలో బీజేపీ ఎంపీల దూకుడు, దుబ్బాక గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు పెరగడంతో రాష్ట్రంలోనూ బీజేపీని ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అంటే ఏక కాలంలో టీఆర్ఎస్‌ను, బీజేపీని ఢీ కొట్టాలి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకున్న కాంగ్రెస్ 2014 నుంచి టీఆర్ఎస్‌నే ఢీకొట్టలేకపోయింది. తాజాగా బీజేపీ కూడా బలం పెంచుకుంది. ఈ పరిస్థితుల్లో పార్టీ నుంచి టీపీసీసీ అయ్యే వ్యక్తి అధిష్టాన నిర్ణయాలను అమలు చేసే డమ్మీగా ఉండకూడదని, ప్రజల్లో క్రేజ్ ఉండడం, కేడర్‌లో ఉత్తేజం నింపడం, దూకుడు ప్రదర్శించడం, దేనికైనా సై అనే వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తే పార్టీ మనుగుడ ఉంటుందని క్షేత్రస్థాయి కేడర్ క్లారిటీగా చెబుతోంది. మరి టీపీసీసీ చీఫ్‌గా ఎవరిని నియమిస్తారు.. ఆ ప్రకంపనలు ఎలా ఉంటాయనేది రానున్న కాలంలో తేలనుంది.
Also Read: టీడీపీ నిర్వీర్యం.. టీఆర్ఎస్‌కు నష్టమేనా..?