(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న ఉత్తరాంధ్రలో ఆ పార్టీ అసమ్మతులకు బీజేపీ గాలం వేస్తోంది. దేశంలో బీజేపీ పవనాలు విస్తృతంగా వీస్తుండటంతో రాష్ట్రంలోనూ తమ పార్టీ పునాదులు పటిష్టం చేసుకునేందుకు ‘ఆపరేషన్ ఆకర్ష్’ ఉపయోగిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే టీడీపీకి చెందిన విజయనగరం జిల్లా చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ గద్దే బాబూరావును బీజేపీలో చేర్చుకుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర మాజీ మంత్రి, బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావును బీజేపీలోకి చేర్చుకునేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది. టీడీపీ నాయకురాలు, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే పడాల అరుణతో మంతనాలు జరుపుతోంది. టీడీపీలో గతంలో ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పటికీ, ప్రస్తుతం ఆ పార్టీ అధిష్టానం తనని పట్టించుకోకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఆమె బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాలో ముఖ్యంగా గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గంలో మంచి పట్టున్న అరుణ బీజేపీలో చేరి తానేంటో రూఢీ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తన అభిమానులు బాహాటంగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
‘కళా’పై వల
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావును బీజేపీలోకి ఆహ్వానించేందుకు ఆ పార్టీ శత విధాలా ప్రయత్నిస్తోంది. ఉత్తరాంధ్రలో సామాజికంగాను, రాజకీయంగాను మంచి పట్టున్న తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కళా వెంకటరావును బీజేపీలో చేర్చుకోవడం ద్వారా ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలో తన పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది.
‘గద్దే’ ద్వారా మంతనాలు
కళా వెంకటరావుకు అత్యంత సన్నిహితుడు, సహచరుడు గద్దే బాబూరావు ద్వారా ‘కళా’ కుటుంబంతో విస్తృతంగా బీజేపీ శ్రేణులు మంతనాలు జరుపుతున్నాయి. అందులో భాగంగా కళా స్వగృహం శ్రీకాకుళం జిల్లా రేగిడి ఆమదాలవలసలో తన జేష్ఠ సోదరుడు రామకృష్ణ నాయుడుతో విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రెడ్డి పావని నేతృత్వంలో రెండు రోజుల క్రితం గద్దే బాబూరావు మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా కళా కుటుంబాన్ని బీజేపీలోకి ఆహ్వానిస్తూ పార్టీలో వారికి సముచిత స్థానం ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చినట్లు తెలిసింది.
కళా కుటుంబంలో ఎటువంటి రాజకీయ నిర్ణయం తీసుకోవాలన్నా రామకృష్ణ నాయుడుదే తుది నిర్ణయం అనేది బహిరంగ రహస్యం. ఈ నేపథ్యంలో బీజేపీ బృందం వారింటికి వెళ్లి, ఆయనతో సంప్రదింపులు జరపడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Also Read: కొత్త జిల్లాలు అడిగితే.. అణచివేతలు తప్పవ్!