ఏలూరులో విరుచుకుపడ్డ వింతవ్యాధి ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. గాలి కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. కానీ ఏలూరు నగరంలో పెద్దగా పరిశ్రమలు కూడా లేవు. కానీ వందలాది మంది నురగలు కక్కుతూ కుప్పకూలడంపై అంతర్జాతీయ సమాజం కూడా దృష్టి సారించింది. వింతవ్యాధి మూలాలను నిగ్గుతేల్చేందుకు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థతోపాటు, కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది. ఇవాళ కేంద్రం పంపిన నిపుణుల బృందం ఏలూరులో పర్యటించనుంది. అంతుపట్టని వ్యాధి మూలాలను వెలికితీసేందుకు మరికొన్ని పరీక్షలు నిర్వహించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ సీసీఎంబీకి పంపిన కల్చర్ రిపోర్టు వస్తే ఏలూరు వింతవ్యాధి కారణాలు తెలిసే అవకాశం ఉంది.
కుప్పకూలిన నగరం
ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 500 మందికిపైగా కిందపడి నోటి వెంట నురగలు కక్కుతూ పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఏలూరు నగరం దక్షిణవీధి నుంచి ప్రారంభమైన ఈ మహమ్మారి నగరమంతా విస్తరించింది. సమీపంలోని దెందులూరులో కూడా ఇవే లక్షణాలతో ఆరుగురు కిందపడిపోయారు. వారికి ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఇప్పటి వరకు అందిన రిపోర్టులను పరిశీలించిన డాక్టర్లు నీటిలో లెడ్ శాతం ఎక్కువగా ఉందని తేల్చారు. ఆక్వాకల్చర్ లో ఉపయోగించే రసాయనాల కారణంగా తాగే నీటిలో లెడ్ లెవల్స్ పెరిగి ఉంటాయని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
ఇదే నిజమైతే కోస్తా ఆంధ్రామొత్తానికి ప్రమాదం పొంచి ఉన్నట్టే. కోస్తా జిల్లాల్లో దాదాపు 6 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. ఆక్వాసాగు చేస్తున్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితం అయిపోతున్నాయిని పర్యావరణ వేత్తలు గగ్గోలు పెడుతున్నారు. ఇప్పటికే కోస్తా ప్రాంతాల్లో భూగర్భ జలాలు తాగడానికి పనికిరాకుండా పోయాయి. ప్రభుత్వం సరఫరా చేసే కాలువ నీరు లేదా, ఆర్వో నీటితో జనం నెట్టుకొస్తున్నారు. ఇక భూగర్భ జలాల్లో లెడ్ లెవల్స్ ఎక్కువైతే ఆర్వో ప్లాంటుల నీరు తాగడం కూడా మంచిది కాదని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.
Also Read ;- వైసీపీ వర్గాల కొట్లాట : ఆస్పత్రిలో ఒకరి దుర్మరణం
కాలుష్య కాసారం
కోస్తా ప్రాంతం ఆక్వాసాగుతో కాలుష్య కాసారంగా మారింది. ముఖ్యంగా భూమి, నీరు కలుషితం అయిపోయాయి. విచ్చలవిడిగా ఆక్వాసాగును ప్రోత్సహించడంతో వేల ఎకరాల నుంచి లక్షల ఎకరాలకు ఆక్వాసాగు విస్తరించింది. ఆక్వాలో పెద్ద ఎత్తున రసాయనాలు వినియోగించడం, చేపలు, రొయ్యల ప్రాసెసింగ్ లో విష రసాయనాలు వాడటం వంటి కారణాలతో ఆక్వాసాగు చేస్తున్న ప్రాంతాలు విషతుల్యం అయిపోయాయి.
అక్కడ పండే పంట, కూరగాయలు, పాలు అన్ని ఆహారపదార్దాల్లో రసాయనాలు చేరిపోయాయి. వీటి లెవల్స్ ఎక్కువైనప్పుడు ఇలాంటి విపత్తులు వస్తుంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఏలూరులో కూడా ఆహారపదార్దాల ద్వారా ప్రమాదకర మెటల్స్ మనిషి శరీరంలో చేరడం వల్లే 500 మందికిపైగా జనం కుప్పకూలిపోయారని తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే ఆక్వాసాగు చేసే ప్రాంతాలు నివాసానికి కూడా పనికిరాకుండా పోయే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫాగింగ్ పొగ పీల్చడం వల్లేనా?
ఏలూరులో నాలుగు రోజుల కిందట దోమల నివారణకు ఫాగింగ్ చేశారు. ఆ పొగ పీల్చి చాలా మంది మూర్ఛలు వచ్చి పడిపోతున్నారేమోననే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఫాగింగ్ లో వినియోగించే రసాయనాల మోతాదు పెరగడం వల్లే ఇలా జరిగి ఉండవచ్చనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా ఏలూరు వింతవ్యాధికి కారణాలను నిగ్గుతేల్చి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు రాకుండా మానవాళిని కాపాడాల్సిన అవసరం ఉంది.
Must Read ;- ఏళ్ల తరబడి ప్రతిపాదనలు.. బాగుపడని ప్రధాన రహదారులు