ఉద్యోగుల ఉద్యమంలో కీలక ఘట్టం!
మెరుగైన పీఆర్సీ సాధనకు గడిచిన పదిరోజులుగా ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు జగన్ సర్కార్ కు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మరోవైపు పీఆర్సీ సాధన సమితి సీరింగ్ కమిటీ సభ్యులు పిలుపు మేరకు ఈ నెల 3న ‘చలో విజయవాడ’ కార్యక్రమం చేస్తున్న ఉద్యమంలో అత్యంత కీలకం కానున్నది. ఈ కార్యక్రమాన్ని ఎలాగోలా భగ్నం చేయాలని కుట్రలకు ప్రభుత్వం తెరతీసింది. అంతేకాక లక్షమందితో చేస్తున్న ఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఉద్యోగుల ఐక్యతను చాటి.. ప్రభుత్వంపై ఇంకా ఒత్తిడిని తీసుకురావాలని భావిస్తోంది. మరోవైపు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున తరలివస్తున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారంతో జగన్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ కార్యక్రమాన్ని బలహీన పరచి, ఉద్యోగుల మనోస్థైర్యంపై దెబ్బకొట్టాలని కుట్రలు పన్నుతోందని జేఏసీ నేతలు ఆరోపిస్తున్నారు.
అధికారపార్టీ మీడియా లీకులను నమ్మోద్దు..
అధికారపార్టీ మీడియా లీకులను నమ్మి.. ‘చలో విజయవాడ’ కార్యక్రమంపై వెనకడుగు వేయొద్దని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పెన్షనర్లకు సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ను సవరిస్తారని, హెచ్ఆర్ఏ శ్లాబుల్లో సవరణలు చేసే ఆలోచనలో ఉన్నారని,పెండింగ్ డీఏ బకాయిల నుంచి రికవరీ చేస్తున్న ఐఆర్ పై పునరాలోచిస్తున్నారని, ఈ అంశాలే ప్రధానంగా సోమవరం సీఎం జగన్ మోహన్ రెడ్డి తో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారంటూ లీకులు వస్తున్నాయని వీటిని ఎట్టిపరిస్థతిలో నమ్మోద్దని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. చలో విజయవాడను భగ్నం చేసేందుకు ప్రభుత్వం సోమవారం ఉదయం నుంచి మీడియాకు రకరకాల లీకులిస్తోందని, మంగళ, బుధవారాల్లో కూడా ఇటువంటి లీకులే వచ్చే అవకాశం ఉందని వీటిని నమ్మి.. వెనకడుగు వేయొద్దని విజ్ఞప్తి చేశారు.
Must Read:-జగన్మోహన్‌రెడ్డికి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చింది.. సోము వీర్రాజు











