ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలిచిన సినిమా ‘జైభీమ్’ అనే చెప్పాలి. ఈ సినిమాకి ఇంత ప్రచారం లభించింది గానీ క్రమేపీ వివాదాల్లో కూరుకుపోతోంది. సినిమాల్లోని కొన్ని సన్నివేశాల పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. విమర్శకుల ప్రశంసలను కూడా ఈ సినిమా పొందింది. అన్ని వర్గాల నుంచి సినిమాకు మద్దతు లభించింది. ఇందులో చెంపదెబ్బ కొట్టే సన్నివేశం ఒకటి ఉంది. ఓ దొంగతనం కేసులో ఓ శేఠ్ ను ఇందులో పోలీస్ ఆఫీసర్ గా నటించిన ప్రకాష్ రాజ్ చెంపదెబ్బ కొట్టే సన్నివేశం అది. దీనిపై ప్రకాష్ రాజ్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు.
ఆ తర్వాత ఆయన మౌనం వహించారు. ఇప్పుడు మరో సన్నివేశంపై వివాదం రేగింది. మతపరమైన గుర్తు ఉన్న ఆ సన్నివేశంపై వివాదం తలెత్తింది. ఒక వర్గం వారు దీనిపై అభ్యంతరం లేవనెత్తారు. దర్శకుడు జ్ఞానవేల్ పై చర్య తీసుకోవాలని కోరుతూ పీఎంకే పార్టీ మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం అక్కడి పోలీస్ కమిషనర్ కు ఓ వినతి పత్రం అందజేశారు. ఓ కులం వారిని హీరో కించపర్చారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. హీరో సూర్యను కొట్టిన వారికి లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.
దీనికి హీరో సూర్య పరిహారంగా రూ. 5 కోట్లు చెల్లించాలని వన్నియార్ సంఘం నోటీసు జారీ చేసింది. దీనిపై కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే నేత అన్బుమణి హీరో సూర్యకు ఓ లేఖను రాశారు. దీనికి సూర్య కూడా వివరణ ఇచ్చారు. ఈ సినిమా ద్వారా ఏ వర్గాన్నీ కించ పరిచే ఉద్ధేశం తనకు లేదని, దళితులపై జరిగే ఘటనలను మాత్రం ఖండిస్తున్నామని సూర్య తెలిపారు. ఈ సినిమాకి మంచి టాక్ వచ్చినా ఏదో ఒక విధంగా ఇరుకున పెట్టే ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి.
Must Read ;- జైభీమ్ సినతల్లికి ఇల్లు కట్టిస్తానన్న లారెన్స్