ఈరోజుల్లో ఓ సినిమా విడుదలై విమర్శకుల ప్రశంసలే కాదు ప్రముఖుల ప్రశంసలు కూడా పొందడం మామూలు విషయం కాదు. అలాంటి ఘనతను ‘జైభీమ్’ సినిమా దక్కించుకుంది.
తమిళ నటుడు సూర్య నటించిన ఈ సినిమాని ఆయన తన భార్య జ్యోతికతో కలిసి నిర్మించడం కూడా ఓ విశేషం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇది నిజజీవిత కథ. చంద్రు అనే ఓ న్యాయవాది జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. రూపాయి కూడా ఫీజు తీసుకోకుండా చంద్రు నిరుపేదల కోసం కేసులు వాదించారు. మరి ఎవరీ చంద్రు? ఏమా కథ అనే విషయాలను తెలుసుకుందాం. వెనుకబడిన జాతుల వారి కోసం న్యాయపోరాటం చేసిన వ్యక్తి చంద్రు. అణచివేతకు గురయ్యేవారి పక్షాన నిలవడం ఆయన ప్రత్యేకత. కొన్నాళ్లు న్యాయవాదిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగానూ నియమితులయ్యారు.
హైకోర్టు జడ్జిగా పనిచేసిన సమయంలో కూడా ఆరేళ్ల వ్యవధిలో 96 వేల కేసులను ఆయన పరిష్కరించారు. ఇది అరుదైన విషయం. 1993లో వృద్ధాచలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ‘జైభీమ్’ చిత్రం రూపొందింది. పోలీసు కస్టడీలో ఉన్న తన భర్త కనిపించడంలేదని సెంగేని అనే మహిళ నిజజీవితంలో కూడా చంద్రును సంప్రదించింది. చంద్రు ఆ కేసును స్వీకరించి న్యాయపోరాటం చేశారు. సర్వసాధారణంగా ఇలాంటి నిరుపేదల మీద కేసులు బనాయించేటప్పుడు చాలా బలమైన ఆధారాలతో ఇరికిస్తారు.
వాటిని ఛేదించడం కూడా కష్టసాధ్యం. కానీ చంద్రు దీన్ని సవాలుగా తీసుకున్నారు. తాను ఈ కేసు టేకప్ చేయడానికి కారణం కూడా అదే అంటారు చంద్రు. నవంబరు 9, 2009లో ఆయన మద్రాసు హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. న్యాయవాదిగా ఉన్నప్పుడు ఆయన తీసుకున్న కేసుల్లో ఎక్కువ భాగం అణగారిన వర్గాలవే. అలాంటి కేసుల్లో ఆయన ఒక్క రూపాయి కూడా ఫీజు తీసుకోలేదట. ఆయన జడ్జిగా నియమితులైనప్పుడు కూడా కీలకమైన తీర్పులిచ్చారు. అలాంటి వాటిలో ఉమ్మడి శ్మశాన వాటికల ఏర్పాటు ముఖ్యమైనది. అప్పటిదాకా కులాలతో సంబంధం ఉండే శ్మశాన వాటికలు ఉండేవి.
జడ్జి హోదాలో ఉన్నప్పుడు కూడా ఆయన హంగూ ఆర్బాటాలకు దూరంగా ఉండేవారు. తన దగ్గర ఉండే బంట్రోతుకు ఎరుపు టోపీ ఉండటం, ఐరన్ బిళ్ల ఉండటం ఆయన ఇష్టం లేకపోయింది. వాటిని తీయించి వేశారు. తన కారు మీద ఉండే ఎర్రలైటును కూడా తీయించారు. తన భద్రత కోసం ఎస్.ఐ. స్థాయి వ్యక్తి అవసరం లేదని, కేవలం కానిస్టేబుల్ చాలని అలా నియమించుకున్నారు. ఆయన పదవీవిరమణ కూడా నిరాడంబరంగా జరిగింది. పదవీవిరమణ రోజు తన ఆస్తిపాస్తుల వివరాలను ప్రధాన న్యాయమూర్తికి అందజేశారు.
ఆరోజు తన అధికార వాహనాన్ని కూడా వాడుకోలేదు. పదవీవిరమణ చేసిన తర్వాత మెట్రో రైలులో తన ఇంటికి వెళ్లారట. చంద్రు స్వచ్ఛందంగా పదవీవిరమణ చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన జడ్జిగా ఉన్నప్పుడు ఆయన ఛాంబర్ వద్ద ఉన్న బోర్డుపై ‘ఇక్కడ ఎవరూ దేవతలు లేరు.. మీరు పూలూ బొకేలూ లాంటివి తేవద్దు.. ఇక్కడ ఎవరూ ఆకలితో లేరు.. మీరు పండ్లు, స్వీట్లు లాంటివి తీసుకు రావద్దు. ఇక్కడ ఎవరూ చలికి వణకడం లేదు.. మీరు శాలువలు తీసుకు రావద్దు’ అని రాసి ఏర్పాటుచేశారట.
ఆయన నిజాయితీకి అద్దం పట్టే బోర్డు ఇది. ఈ వాస్తవ గాధ ఆకర్షంచడంతో సూర్య, జ్యోతిక దీన్ని తెరకెక్కించారు. దర్శకుడు జ్ణానవేల్ దీనికి చక్కటి తెరరూపం ఇచ్చారు. ఇప్పుడీ సినిమా మంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. నవంబరు 2న ఆమెజాన్ ప్రైమ్ దీన్ని విడుదల చేసింది. సినిమా చూసిన వారు థియేటర్లలో రిలీజై ఉంటే బాగుండేదని వ్యాఖ్యానిస్తున్నారు. తమిళ నాడు సీఎం స్టాలిన్ కూడా ఈ సినిమా చూసి చలించిపోయానని కామెంట్ చేశారంటే దర్శకుడి ప్రతిభను కూడా మెచ్చుకుని తీరాల్సిందే.
Must Read ;- ఓ హీరోయిన్ ‘శ్రుతి’మించని రిలేషన్ షిప్











