వాస్తవ గాథను ‘జైభీమ్’ సినిమాగా తీస్తే కనకవర్షం కురుస్తోంది. చంద్రు పాత్ర పోషించిన నిర్మాత సూర్యకు మంచి పేరు వచ్చింది. అంతకన్నా ఎక్కువగా ఎవరికీ తెలియని న్యాయవాది చంద్రు గురించి ప్రపంచానికి వెల్లడైంది. కానీ అసలు ఈ సినిమాలో భర్తను కోల్పోయిన సిన తల్లి ఎక్కడ ఉంది? ఆమె ఎలా జీవిస్తోంది? అన్నది మాత్రం ఈ లోకానికి తెలియదు. సినిమాకి ఒక ముగింపు ఉండాలి కాబట్టి ఆమెకు కోర్టు తీర్పు మేరకు చక్కటి ఇల్లు నిర్మించి ఇచ్చారని చూపించారు. నిజానికి చినతల్లి ఓ గుడిసెలో ఉంటోందట.
మరి ఆమెకు మంచి జీవితాన్ని ప్రసాదించాలన్న కోరిక ఇప్పటి వరకూ ఎవరికీ ఎందుకు కలగలేదో. మహానటి సావిత్రి జీవితాన్ని సినిమాగా తీస్తే కోట్లు వసూలు చేసింది. సినిమా హిట్ అయినప్పుడు ఎంత వసూలవుతుంది, ఎంత పేరు వస్తుంది అని ఆలోచిస్తారే తప్ప అసలు ఆ సినిమాకు మూలాధారమైన వ్యక్తులు ఇపుడు ఎక్కడ ఎలా ఉన్నారు అని ఎవరూ ఆలోచించరు. ఇలాంటి సినిమా ఓ 50 కోట్లు వసూలు చేసింది అనుకుంటే అందులో కొంత భాగాన్ని ఆ కుటుంబాలకు కేటాయిస్తేనే వారికి న్యాయం జరిగినట్టు లెక్క.
ఆఖరికి తమిళ నాడు సీఎం స్టాలిన్ కూడా సినిమా చూసి బాగుందన్న ప్రశంసించారు. ఆదివాసీల సంక్షేమానికి ఈ చిత్ర నిర్మాతలైన సూర్య దంపతులు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించి ఆ చెక్కును సీఎం స్టాలిన్ కు అందజేసిన సంగతి తెలిసిందే. అయితే హీరో రాఘవ లారెన్స్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. అసలు సినతల్లి ఎక్కడో మారుమూల గుడిసెలో తలదాచుకుంటోందని తెలుసుకున్నారు. ఆమె అసలు పేరు పార్వతి అమ్మాళ్. వయసు మీద పడినా పూరి గుడిసెలోనే ఆమె బతుకు వెళ్లదీస్తోందని తెలుసుకుని చలించిపోయారు.
ఆమెకు ఓ ఇల్లు కట్టించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. చేయని నేరానికి చిత్రహింసలకు గురై మరణించిన రాజా కన్ను కుటుంబాన్ని ఆదుకుంటానని లారెన్స్ మాటిచ్చారు. సినతల్లికి ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. సినిమాని దర్శకుడు జ్ఞానవేల్ అద్భుతంగా తెరకెక్కించారని, సినతల్లి చేసిన పోరాటాన్ని చూసి ఆశ్చర్యపోయానన్నారు. లారెన్స్ తీసుకున్న ఈ నిర్ణయం పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఈ సినిమాకు అవార్డులు, రివార్డులు ఇవ్వడం కన్నా బాధితులకు ఆర్థికంగా అంతో ఇంతో సాయం చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. ఇది జనజీవితంలో నుంచి పుట్టిన కథ. పోరాడి అసిపోయిన జీవితాలు ఇప్పటికైనా సేద తీరాలంటే వారికి ఆర్థిక పరమైన చేయూత చాలా అవసరం. చిత్ర నిర్మాతలు ఈ బాధితులను ఆదుకోవడమే కాకుండా ప్రభుత్వం కూడా వీరికి చేయూతనందించేలా తోడ్పడితే ఇంకా బాగుంటుంది. ఇలాంటి నిర్ణయం తీసుకుని రాఘవ లారెన్స్ తనలోని దానగుణాన్ని మరోసారి చూపారు.
Must Read ;- చిరు 154వ చిత్రం ఫస్ట్ లుక్ అరాచకం











