సౌత్ ఇండియాలోనే సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ మీద పదేళ్ల నుంచి మద్రాస్ హైకోర్టులో కాపీ కేసు నడుస్తోంది. శంకర్ ప్రముఖ హీరో రజనీకాంత్ కాంబినేషన్ లో మొదటి సారి వచ్చిన సినిమా ‘ రోబో ‘. 2010 లో విడుదలైన ఈ సినిమా కి తమిళంలో ‘ఏంథిరన్ ‘ అనే పేరు పెట్టారు. అప్పట్లో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమిళంలో పేర్లు పెట్టిన సినిమాలకు మాత్రమే వినోదపు పన్నులో రాయితీ ఇచ్చే వారు. అందుకని తమిళంలో ఏంథిరన్ అని పేరు పెట్టినా తెలుగు , హిందీలో ‘ రోబో ‘ అనే పేరుతొ రిలీజ్ చేశారు. అన్ని భాషల్లో ‘రోబో’ సినిమా సూపర్ హిట్ అయింది. 2010లోనే తమిళనాడుకి చెందిన ఒక షార్ట్ స్టోరీ రైటర్ ఆరూర్ తమిళ నాథన్, తన కథ కాపీ కొట్టి రోబో సినిమా తీశారని, ఇండియన్ కాపీ రైట్స్ యాక్ట్ ప్రకారం కేసు వేశారు.
ఆరూర్ తమిళ నాథన్1996 ‘ జుగుబ ‘ అనే కథ రాశారు. ఆ కథ అప్పటి ఒక ప్రముఖ తమిళ వార పత్రికలో పబ్లిష్ అయింది. జుగుబా కథని 2007లో పునర్ముద్రించారు. ఆ కథ ఆధారంగానే డైరెక్టర్ శంకర్ ‘రోబో ‘ సినిమా తీశాడని రచయిత కోర్ట్ లో కేసు వేశారు. 2010 నుంచి ఈ కాపీ కేసు విచారణ సాగుతోంది. పదేళ్లు అయిపోయింది కాబట్టి తన మీద ఈ కేసు కొట్టేయాలని దర్శకుడు శంకర్ చెన్నై హైకోర్టుని ఆశ్రయించారు. అయితే హైకోర్టు కేసుని కొట్టేయడానికి నిరాకరించింది. దాంతో శంకర్ సుప్రీమ్ కోర్టుకు వెళ్లి కేసు నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు.











