దేశంలో మళ్లీ కలకలం. హమ్మయ్య.. ఇక కరోనా ముప్పు తప్పిపోయినట్టేలే.. అని సంబరపడుతున్నంతలోనే కొత్త కొత్త రూపాల్లో.. సరికొత్త కొమ్ములతో మళ్లీ విరుచుకుపడుతోంది. రోజురోజుకీ.. క్రమక్రమంగా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. గడచిన మూడు రోజులుగా కేసులు 16 వేలకు పైగానే నమోదవుతున్నాయి. పదిరోజుల ముందు వరకు 9 నుంచి 12 వేల మధ్య నమోదవుతున్న కేసులు.. మూడు రోజులుగా 16 వేలు దాటి పోవడం ఆందోళన కలిగిస్తోంది. అదే స్థాయిలో మరణాలూ పెరుగుతున్నాయి. రికవరీలను మించి కేసులు నమోదవుతుండడంతో.. యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
దేశంలో శుక్రవారం 16,488 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో.. మొత్తం కేసుల సంఖ్య 1,10,79,979కి చేరింది. తాజాగా 113 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 1,56,939కి పెరిగింది. గడచిన 24 గంటల్లో 12,771 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1,59,590కి పెరిగింది. మొత్తం కేసుల్లో ఇది 1.44 శాతం కావడం గమనార్హం. ఇక రికవరీలు 1.07 కోట్లకు పైబడగా.. ఆ రేటు 97.14 శాతంగా ఉంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరో వైపు టీకా కార్యక్రమం కూడా జోరుగా సాగుతోంది. శుక్రవారం రాత్రి 7 గంటల వరకు దేశంలో మొత్తం 1,42,42,547 మందికి వ్యాక్సిన్ అందించారు. కాగా, ప్రభుత్వం.. ఈ శని, ఆది వారాలు వ్యాక్సినేషన్ కు సెలవు ప్రకటించింది.
Must Read ;- దేశంలో కొత్తగా రెండు కరోనా వేరియంట్స్..