(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
జీవీఎంసీ చరిత్రను పరికిస్తే పాతికేళ్లు పాలకవర్గం ఉండగా, 15 ఏళ్ళు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగింది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 42 ఏళ్ల చరిత్రలో ఒక్కసారి మినహా ఎప్పుడు సకాలంలో ఎన్నికలు జరగలేదు. ఐదు సార్లు జరిగిన ఎన్నికల్లో, నాలుగు సార్లు పాలకవర్గం పదవీకాలం తీరిన తరువాత ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగింది. సో.. జీవీఎంసీ కు ప్రత్యేక అధికారి పాలన కొత్తేమి కాదు.
50 వార్డులతో విశాఖ మున్సిపల్ కార్పొరేషన్
50 వార్డులతో కూడిన విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 1979లో ఏర్పాటయింది. రెండు ఏళ్ళ తరువాత తొలిసారిగా 1981లో కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్‌గా అప్పటి భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎన్ ఎస్ ఎన్ రెడ్డి ఎన్నికయ్యారు. 1986 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. అప్పటి నుంచి గ్యాప్ వచ్చి ఏడాది పాటు ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. 1987లో నిర్వహించిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి డివి సుబ్బారావు మేయర్ పీఠాన్ని అలంకరించారు. ఆయన ఐదేళ్లు కొనసాగిన తరువాత 1992 నుంచి 95 వరకు మళ్లీ ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది.

1995లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన సబ్బం హరి మేయర్ అధికారాన్ని దక్కించుకున్నారు. 2000 సంవత్సరంలో ఆయన పదవీ కాలం ముగిసిన వెంటనే ఎన్నికల నిర్వహణ చేపట్టారు. పాలకవర్గ కాలం ముగిసిన వెంటనే నిర్వహించిన ఏకైక ఎన్నిక అదే. ఆ ఎన్నికల్లో మేయర్‌గా మాజీ ఎమ్మెల్యే రాజాన రమణి కాంగ్రెస్ పార్టీ తరపున మేయర్ పీఠాన్ని అధిరోహించారు. 2005తో ఆమె పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి మరో రెండేళ్లపాటు ప్రత్యేక అధికారి పాలనలోనే మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. 2007లో మళ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కన్నా తెలుగుదేశం పార్టీ ఎక్కువ సీట్లు దక్కించుకున్నప్పటికీ, ఇండిపెండెంట్ల సాయంతో కాంగ్రెస్ మేయర్ పీఠం వశం చేసుకుంది.
2012లో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఆవిర్భావం..
ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న విశాఖ కార్పొరేషన్ జీవీఎంసీ గా మార్చారు. గాజువాక మున్సిపాలిటీ, 32 పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేశారు. దీంతో వార్డుల సంఖ్య 50 నుంచి 72 కి పెరిగాయి. అక్కపల్లి, భీమునిపట్నం పురపాలక సంఘాలతో పాటు కొన్ని పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేశారు. అనంతరం వార్డుల విభజన ప్రక్రియ చేపట్టారు. జీవీఎంసీ పరిధి విస్తరించడంతో వార్డుల సంఖ్య 98కి చేరింది. కార్పొరేషన్ చరిత్ర పరికించి చూస్తే.. పాతికేళ్లు పాలకవర్గం ఉండగా, 15 ఏళ్ళు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగడం విశేషం.
మేయర్ స్థానానికి పరోక్ష ఎన్నికలు..
1981లో మేయర్‌ను పరోక్ష పద్ధతిలోనే ఎన్నుకున్నారు. 1987 లో మాత్రమే మేయర్ స్థానానికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించారు. మిగిలిన నాలుగు సార్లు పరోక్ష పద్ధతిలోనే ఎన్నుకున్నారు. ప్రస్తుతం కూడా పరోక్ష పద్ధతిలో నే మేయర్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు.
Must Read ;- అప్పుడు పంచ గ్రామాల భూ సమస్య.. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ











