మూఢంగా కారణంగా చాలా కాలంగా పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలు వాయిదా పడిపోయాయి. మే 4వ తేదీతో మూఢం వెళ్లిపోతోంది. ఇక అక్కడి నుంచి శుభముహూర్తాలు ఉన్నాయి. కానీ కరోనా కనికరించాలి కదా. కరోనా మరణాలతో అంతా అశుభ వార్తలే వింటుంటే ఇక శుభముహూర్తాలు ఇంకెక్కడ. కరోనా కోరలు చాచి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. గత ఏడాది లాక్ డౌన్ నుంచి ఇప్పటిదాకా పెళ్లిళ్ల విషయంలో ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. హంగూ ఆర్భాటాలు లేకుండా పెళ్లిళ్లు చేసుకున్న వారే ఎక్కువ. పైగా దాదాపు ఏడాది కాలంలో ప్రతి ఇంట్లోనూ చావు వార్తలే వినిపించాయి. దాంతో శుభకార్యాలు వాయిదాపడిపోవడం కూడా జరిగింది.
మరి కరోనా సెకండ్ వేవ్ తీవ్రత చూస్తుంటే మూఢం వెళ్లిపోయినా పెళ్లిళ్లు జరిగే వాతావరణం కనిపించడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వాలు ఆంక్షలు క్రమేపీ పెంచుతోంది. ఇప్పటికే కర్ఫ్యూ అమలవుతోంది. మున్ముందు లాక్ డౌన్ కు పరిస్థితులు దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ప్రస్తుతం రాత్రుళ్లు కర్ఫ్యూ అమలులో ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే మే నెలలో కూడా పెళ్లిళ్లు జరిగే అవకాశం లేదు. సాధారణంగా ముహూర్తాలన్నీ రాత్రుళ్లే ఉంటాయి. కొన్ని పట్టణాలు, నగరాల్లో స్వచ్ఛంద లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలను భరించే పరిస్థితి లేదు.
కరోనా సెకెండ్ వేవ్ లో పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గత ఏడాది కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. చూస్తుంటే చరిత్ర పునరావృతమవుతున్నట్టుంది. గతే ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకూ కొంత వెసులు బాటు కలిగింది. ఆ తర్వాత దాదాపు రెండు నెలలకు పైగా గురు, శుక్ర మౌఢ్యాలు వచ్చాయి. మే 4వ తేదీ ఉదయం 7 గంటలకూ శుక్ర మౌఢ్యం ముగుస్తుంది. చాలామంది మే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయని సంబంధాలు కూడా కుదుర్చుకుని పెళ్లిళ్లకు ఏర్పాట్లు చేసుకున్నారు.
ముహూర్తాలు నిర్ణయించుకుని కళ్యాణ మండపాలకు అడ్వాన్సులు కూడా ఇచ్చుకున్నారు. మూఢం ముగియడానికి మరో 10 రోజులు మాత్రమే మిగిలి ఉంది. పరిస్థితి చూస్తుంటే కరోనా తీవ్రత మరింత పెరిగే వాతావరణమే ఉంది. అనుకున్న సమయానికి పెళ్లిళ్లు చేయాలా? వాయిదా వేయాలా? అన్న మీమాంసలో తల్లిదండ్రులు ఉన్నారు. పెళ్లిళ్ల మీద ఆధారపడి చాలా వ్యాపారాలు జరుగుతుంటాయి. అలాగే శుభకార్యాలు జరిగితేనే పండితులకు ఉపాధి దొరుకుతుంది. మరి మే నెల ముహూర్తాల విషయంలో నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
Must Read ;- కరోనా పేరిట కొత్త దందా.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న విజిలెన్స్ అధికారులు