ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ పేరిట ఇప్పుడు కొత్త దందా మొదలైపోయింది. కరోనా పేరు చెబితేనే జనం బెంబేలెత్తిపోతూ ఉంటే… వారిలోని భయాన్ని క్యాష్ చేసుకునే దిశగా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు తమదైన శైలిలో కొత్త దందాను షురూ చేశాయి. మంగళవారం ఏపీలోని విశాఖ, నెల్లూరు నగరాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు చేయగా ఈ నయా దందా వెలుగు చూసింది.
చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా..
కోవిడ్ నిర్దారణ టెస్టులకు అధిక ధరలు తీసుకుంటే… కఠిన చర్యలు తప్పవని ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూనే ఉన్నాయి. అదే సమయంలో కోవిడ్ సోకిన వారికి ప్రాథమికంగా ఇచ్చే రెమ్‌డెసివిర్ మెడిసిన్ సహా… కోవిడ్ చికిత్సకు వినియోగించే ఔషధాలను అధిక ధరలకు విక్రయించడం కూడా నేరం కిందకే వస్తుందని కూడా ప్రభుత్వాలు ప్రకటించాయి. అయితే ఇవేవీ ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ మెడికల్ షాపులకు పట్టడం లేదు. కోవిడ్ అంటేనే జడిసిపోతున్న జనంలోని భయమే పెట్టుబడిగా కొత్త దందాను ప్రారంభించేశాయి.
మందులు, టెస్టులకు అధిక ధరలు
ఇందులో భాగంగా రెమ్‌డెసివిర్ ఔషధం ధరను ఇష్టారాజ్యంగా పెంచేసిన ప్రైవేట్ ఆసుపత్రులు డిమాండ్‌ను బట్టి రేట్లను అమాంతంగా పెంచేస్తున్నాయి. అదే విధంగా కోవిడ్ టెస్టులను నిర్దేశిత రేట్లకే చేయాల్సిన ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు… ఆ రేట్లను కూడా పెంచేశాయి. కరోనా నుంచి బయటపడితే చాలు… ,ధర ఎంతైతే ఏమిటి? అన్న భావనతో జనం కూడా వారు చెప్పిన రేట్లనే చెల్లించి టెస్టులు చేయించుకునేందుకు సిద్ధపడుతున్నారు. సర్కారు నిర్వహిస్తున్న టెస్టులు కొద్దిమందికే పరిమితం అవడం, టెస్టులు చేస్తున్న ప్రాంతాల్లో భౌతిక దూరం అన్న మాటే వినిపించకపోవడం… తదితర కారణాలతో చాలా మంది ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.
రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విజిలెన్స్ అధికారులు
ఇదే అదనుగా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు నయా దందాను ప్రారంభిచేశాయి. దీనిపై పలువురి నుంచి ఫిర్యాదులు అందుకున్న విజిలెన్స్ అధికారులు మంగళవారం అటు విశాఖతో పాటు ఇటు నెల్లూరులో వరుస దాడులు చేశారు. ఈ దాడుల్లో రెమ్‌డెసివిర్ ఔషథాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ విశాఖలోని ఓ మెడికల్ షాపు యజమాని విజిలెన్స్‌కు దొరికిపోయారు. అదే విధంగా కోవిడ్ టెస్టులకు అధిక ధరలను వసూలు చేయడంతో పాటుగా రెమ్‌డెసివిర్ ఔషధాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్న నెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రి నిర్వాహకుడు కూడా విజిలెన్స్‌కు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. విజిలెన్స్ రంగంలోకి దిగిన నేపథ్యంలో ఇలా కోవిడ్ పేరిట నయా దందాకు పాల్పడుతున్న వారంతా అప్రమత్తమైనట్లుగా సమాచారం.
Must Read ;- తవ్వేకొద్దీ దుర్గగుడిలో అక్రమాలు.. విజిలెన్స్ షాక్