ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలనలో పేదలు మరింత పేదలుగా, ధనికులు మరింత ధనికులుగా తయారై అసమానతలు పెరిగిపోతున్నాయని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆందోళన వ్యక్తం చేశారు. పేదవారి ఆదాయం దారుణంగా తగ్గిపోయిందనే సర్వేలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన అన్నారు.జగన్ పాలనలో వైద్యం, విద్యారంగాలు దారుణంగా దెబ్బతిన్నాయని యనమల ఆరోపించారు. ఏపీలో లిక్కర్ మాఫియాలు పెరిగిపోయాయని, కొత్త ధనిక వర్గాలను తయారు చేస్తున్నారని, దీని వల్ల పేదవారికి తీవ్రమైన నష్టం జరుగుతోందని యనమల ధ్వజమెత్తారు.
కోవిడ్ కారణం కాదు
కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందని చెబుతున్నారని, మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్ర ఆదాయం దారుణంగా తగ్గలేదని యనమల గుర్తు చేశారు. అధికారంతో డబ్బు సంపాదించాలనే కోరిక, అవినీతితో డబ్బులు సంపాదించడం, అధికారులను అవినీతిలో భాగస్వాములను చేయడం ఇవన్నీ జగన్మోహన్‌రెడ్డి పాలనలో కొనసాగుతున్నాయన్నారు. ఏపీలో అసమానతలతో పాటు, పేదరికం కూడా గణనీయంగా పెరిగిందని యనమల ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో గ్రామీణ ప్రాంతాల్లో 24 శాతం పేదరికం పెరిగిందని, పట్టణ ప్రాంతాల్లో 29 శాతం పెరిగిందనే రిపోర్టులు ఆందోళన కలిగించే అంశమని యనమల గుర్తు చేశారు. పేదరికం పెరుగుతూ ఉంటే ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు కూడా పేదరికంలోకి జారిపోయారని ఆయన గుర్తు చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే అసమానతలు పెరిగి, సమాజంలో అశాంతి వచ్చే ప్రమాదం ఉందన్నారు. 90 శాతం కుంటుంబాల ఆదాయం కూడా దారుణంగా పడిపోవడం విద్య, వైద్యంపై ప్రభావం చూపుతోందన్నారు.
Must Read ;- జగన్ బెయిల్ రద్దు కేసు విచారణ జులై 1కి వాయిదా











