అనుమతులపై డిసిజిఐ తాజా ప్రకటన విడుదల చేసింది. కొవిషీల్డ్, కొవ్యాక్సిన్‌లకు అనుమతులు ఇచ్చినట్టు తెలియజేసింది. వ్యాక్సిన్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్స్ లేవని తెలిపింది. ఈ రెండు వ్యాక్సిన్స్ రెండు డోసులు ఇవ్వాల్సి ఉంటుందని తెలియజేసింది. కొవ్యాక్సిన్ మూడో దశ ట్రయిల్స్ జరుగుతున్నట్లు తెలిపింది. డిసిజిఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారంలో వ్యాక్సిన్లు ప్రజలకు అందుబాటులో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రశంసల వెల్లువ
భారత్ బయోటెక్ తయారుచేస్తున్న వ్యాక్సిన్ అనుమతుల గురించి అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసిన సిడిఎస్‌సిఓ, కొవ్యాక్సిన్ రెండు దశల ట్రయిల్స్ డేటాను పరిశీలించిన మీదట.. కొన్ని నిబంధనల మధ్య కొవ్యాక్సిన్ అనుమతులు ఇవ్వాల్సిందిగా డిసిజిఐకి రికమెండ్ చేసింది. పూర్తి దేశీయ టెక్నాలజీతో తయారుచేసిన కొవ్యాక్సిన్‌కు విదేశీ సంస్థల నుండి కూడా ఎన్నో ప్రశంసలు అందుకుంది.
కొవ్యాక్సిన్ మూడో దశ ట్రయిల్స్ నవంబర్ మధ్యలో పెద్దఎత్తున దాదాపు 26,000 వాలంటీర్లపై ప్రయోగించింది. 42 రోజుల తర్వాత వ్యాక్సిన్ పూర్తి డేటా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో.. దానికి సంబంధించిన ట్రయిల్స్ ఇంకా పూర్తి కాకపోవడంతో.. మొదటి రెండు దశల డేటాను ఆధారం చేసుకుని వ్యాక్సిన్ సామర్థ్యాన్ని, టీకా రక్షణ వ్యవస్థకు సంబంధించి ఒక అంచనా వేసి.. అనుమతులు అందించాల్సిందిగా నిపుణుల కమిటీ రికమెండ్ చేయడంతో.. దేశీయ వ్యాక్సిన్‌కు అనుమతులు లభించాయి. వీటితో పాటు జైడస్ కాడిల్లా వ్యాక్సిన్‌కు మూడో దశ ట్రయిల్స్‌కు అనుమతులు అందించింది డిసిజిఐ. డిఎన్‌ఏ ఆధారంగా జైడస్ టీకా ప్రిపేర్ చేస్తున్నట్లు తెలిపింది. కానీ, ఇప్పటి వరకు కూడా మొదటి రెండు దశల ట్రయిల్ రన్ డేటాను విడుదల చేయలేదు.
మొదటి దశలో 30 కోట్లు
వ్యాక్సిన్ మొదటి దశలో భాగంగా దేశంలో 30 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 3 కోట్ల మంది డాక్టర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి అందివ్వనున్నట్లు తెలిపింది. మిగిలిన 27 కోట్లలో 50 ఏళ్ల పైబడిన వ్యక్తులకు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారికి టీకా అందించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది.