ఆత్మవిశ్వాసం ఉంటే సాధించలేనిది లేదు .. పట్టుదలతో పరిశ్రమిస్తే విజయం దాసోహం అంటుంది అనే విషయాన్ని మరోమారు నిరూపించిన వ్యక్తిగా ‘సుధా చంద్రన్’ కనిపిస్తారు. సుధాచంద్రన్ అంటే ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ‘మయూరి’ సుధ అంటే మాత్రం వెంటనే తెలిసిపోతుంది. ఎందుకంటే ‘మయూరి’ సినిమా అంతగా జనంలోకి వెళ్లింది. ఆమెకి అశేష ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించిపెట్టింది. తాజాగా సుధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో మాట్లాడుతూ, ‘మయూరి’ సినిమా ముచ్చట్లు పంచుకున్నారు.
భరతనాట్యంలో నేను మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. ఆ తరువాత అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఒక కాలును కోల్పోయాను. కృత్రిమ కాలును అమర్చుకుని తిరిగి నాట్యాన్ని సాధన చేయడం మొదలుపెట్టాను. అలాంటి పరిస్థితుల్లోనే నిర్మాత రామోజీరావుగారి నుంచి నాకు కబురు వచ్చింది. నా జీవితచరిత్రను సినిమాగా తీయాలనుకుంటున్నట్టు చెప్పారు. అందుకు నేను ఆనందంగా అంగీకరించాను. దాంతో సింగీతం శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో ‘మయూరి’ పట్టాలెక్కడానికి సిద్ధమైంది.
ముందుగా ఈ సినిమాలో నా పాత్రను ఒక స్టార్ హీరోయిన్ తో చేయించాలనుకున్నారు. సెకండాఫ్ లో మాత్రం నన్ను చూపించాలనుకున్నారు. కానీ ఆ తరువాత నా పాత్రను పూర్తిస్థాయిలో నేను చేస్తేనే బాగుంటుందని భావించారు. అదే విషయాన్ని నాతో చెప్పారు. ఒక్కసారిగా నేను ఆశ్చర్యపోయినప్పటికీ ఆ తరువాత చాలా సంతోషంగా అనిపించింది. అలా నేను ‘మయూరి’ చేశాను. ఆ సినిమా నా కెరియర్లో ఒక ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. తెలుగులో ఫస్టు బయోపిక్ నాదేనని నేను గర్వంగా చెప్పగలను. సాధారణంగా ఒకరి బయోపిక్ లో క్రేజ్ ఉన్న మరొక ఆర్టిస్ట్ నటిస్తుంటారు. కానీ నా బయోపిక్ లో నేను నటించడం విశేషం” అని చెప్పుకొచ్చారు.
Must Read ;- సీరియల్స్ లో, సోషల్ మీడియాలో దూసుకెళుతోన్న అందమైన అత్తగారు