ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిపై రెఫరెండం నిర్వహిస్తే అమరావతికి వ్యతిరేకంగా ప్రజల తీర్పు వస్తే గనుక.. తాను రాజకీయ సన్యాసం చేస్తానని చంద్రబాబునాయుడు అన్న మాటలు ప్రస్తుతం ఏపీలో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. గురువారం నాడు.. అమరావతి పోరాట సమితి ఆధ్వర్యంలో జనభేరి పేరిట భారీ బహిరంగ సభ జరిగిన నేపథ్యంలో శుక్రవారం నాడు.. రాష్ట్రానికి మూడు రాజధానులే కావాలంటూ.. వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్ద ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానుల వల్ల ఏ ప్రాంతానికి నష్టం ఉండదని, అంతా సమానమైన అభివృద్ధి జరుగుతుందని వారు చెప్పుకొచ్చారు. తెలుగుదేశం నుంచి గెలిచి, ప్రస్తుతానికి వైసీపీతో అంటకాగుతున్న ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడా ఈ ర్యాలీలో పాల్గొని మూడు రాజధానులకు అనుకూలంగా తన అభిప్రాయాలు వెల్లడించారు.
ఇదే ర్యాలీలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు విసిరిన రెఫరెండం సవాలును స్వీకరించడానికి తాను సిద్ధమేనని అన్నారు. కావాలంటే తక్షణమే రాజీనామా చేసి.. రాజధాని అంశం మీదనే ఎన్నికలకు వెళ్తానని కూడా సవాలు విసిరారు. నిజానికి ఇది చంద్రబాబునాయుడు విసిరిన సవాలు కంటె చాలా పెద్దది.
ఎందుకంటే.. రెఫరెండం నిర్వహించి, ప్రజల తీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా వస్తే మాత్రమే తాను రాజీనామా చేస్తానని చంద్రబాబునాయుడు ప్రకటించారు. కానీ, ఎమ్మెల్యే ముస్తఫా ఒక అడుగు ముందుకు వేసి.. తాను ముందే రాజీనామా చేస్తానని, రాజధాని అంశం మీదనే ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమని సవాలు విసురుతున్నారు. కానీ ముస్తఫా ఒక మెలిక పెడుతున్నారు. తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే తక్షణం రాజీనామా చేయడానికి సిద్ధమని అంటున్నారు. ఇలాంటి సవాలును స్వీకరించి.. ముస్తఫా రాజీనామా చేయడానికి జగన్ అనుమతించడం అంటూ జరగదు. ఆయన రాజీనామా చేయడం కూడా జరగదు.
Must Read ;- నాకు ఇల్లు లేదన్నారు.. అమరావతిలో ఇల్లు కట్టిన జగనేం పీకాడు: చంద్రబాబు
ముస్తఫా ధైర్యం జగన్‌కు లేదా?
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేనే అయినప్పటికీ.. ముస్తఫా ధైర్యంగా ఒక ప్రకటన చేయగలిగారు. రాజీనామా చేయగలననే మాట ఆయన నోటినుంచి వచ్చింది. జగన్ కు ముడిపెట్టిన సంగతి కాసేపు పక్కన పెడితే.. ధైర్యంగా ఇదే మాట జగన్మోహనరెడ్డి అనగలరా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. ఒక్క ఎమ్మెల్యే రాజీనామా చేయడం కాదు, ఇవాళ వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఎవరెవరైతే మూడురాజధానులకు మద్దతుగా ర్యాలీ చేస్తున్నారో.. వారందరూ కూడా రాజీనామాలు చేసి. ధైర్యంగా మళ్లీ ప్రజల తీర్పు కోరాలి. నిజంగానే వారు అంటున్నట్లుగా మూడు రాజధానులను ప్రజలందరూ కోరుకుంటూ ఉంటే గనుక.. వారికి మళ్లీ విజయాలు దక్కుతాయి. వారి వాదన కూడా గెలుస్తుంది.
అంతే తప్ప.. ఏడాదిగా దీక్షలు చేస్తున్న రైతులు నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతం కాగానే.. మూకుమ్మడిగా మూడు రాజధానులకు అనుకూలంగా ప్రదర్శనలు చేయడం కాదు. ఆ వాదనకు ప్రజల మద్దతు ఉందని సాధికారికంగా నిరూపించుకుంటేనే బాగుంటుంది.
Also Read ;- నలుదిక్కుల ప్రతిధ్వనించనున్న రాజధాని జనభేరి!