అలుపెరగని పోరాటం. ఎక్కడా రక్తం చిందకపోయినా, వేలాది మంది రైతుల కళ్లలో రక్తకన్నీరు ఉబికింది. అమరావతి రాజధాని ఉద్యమం సంవత్సరం పూర్తి చేసుకుంది. సంవత్సరంపాటు సాగిన ఉద్యమాలు ప్రపంచంలో చాలా అరుదు. అమరావతి ఉద్యమం కూడా అరుదైనదే. శాంతియుతంగా చేయడం వల్లే అమరావతి ఉద్యమం నేటికీ నిలిచి ఉంది. ఉద్యమంలో ఏ మాత్రం హింస చోటు చేసుకున్నా అణచివేయాలని ప్రభుత్వం కాసుకుకూర్చుంది. అలాంటి ఉద్యమానికి ఏడాది నిండిన సందర్భంగా విజయవాడలో రాజధాని రైతులు తలపెట్టిన మహాపాదయాత్రకు భారీ స్పందన వచ్చింది.
మార్మోగిన జై అమరావతి
నినాదాలుఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ అమరావతి రైతులు సాగిస్తున్న ఉద్యమం సంవత్సర కాలం పూర్తి చేసుకోనుంది. ఇందులో భాగంగా విజయవాడలో చేపట్టిన మహాపాదయాతకు అమరావతి రాజధాని రైతులతోపాటు రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పడవల రేవు నుంచి మీసాల రాజారావు బిడ్జి వరకు సాగిన మహాపాదయాత్రకు భారీ స్పందన వచ్చింది. అమరావతి రాజధాని సాధించుకునే వరకు పోరాటం సాగిస్తామని రైతులు ప్రకటించారు. అమరావతి జేఏసీ నేతలు, రాజధాని సాధన సమితి పొలికేక నాయకులు మహాపాదయాత్రలో పాల్గొన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించకపోతే అదే చివరి ఛాన్స్ అవుతుందని జేఏసీ నేతలు విమర్శించారు.
మహిళలను రోడ్డుమీదకు లాగారు
ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ పది మందికి అన్నం పెట్టిన రాజధాని రైతులను, మహిళలను ఈ ముఖ్యమంత్రి రోడ్డుమీదకు లాగాడని పాదయాత్రలో పాల్గొన్న మహిళలు విమర్శించారు. రాజధాని కోసం 33 వేల ఎకరాల పంట భూములు ఇస్తే వైసీపీ ప్రభుత్వం రోడ్డు మీదకు లాగిందని రైతులు తీవ్ర విమర్శలు చేశారు. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని కోసం భూములు ఇచ్చామని, ప్రభుత్వం మారిన ప్రతిసారీ రాజధాని మారుస్తారా? అంటూ మహాపాదయాత్రలో పాల్గొన్న రైతులు ధ్వజమెత్తారు. సంవత్సరం నుంచి అమరావతి రాజధాని కోసం ఉద్యమం చేస్తుంటే ముఖ్యమంత్రి కనీసం నోరు మెదపడం లేదని విమర్శించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకూ ఉద్యమం ఆపేది లేదని రైతులు తెగేసి చెప్పారు.
Must Read ;- అమరావతి పోరాటానికి ‘ఎండ్ కార్డ్’ వేసే కుట్ర!
ఢిల్లీ తరహాలో ఉద్యమం ఉదృతం చేస్తాం
అమరావతి ఉద్యమాన్ని సంవత్సరం పాటు శాంతియుతంగా చేశామని, రాయపూడి జనభేరి తరవాత ప్రతి రోజూ రోడ్డుపైనే ఉద్యమిస్తామని మహిళా రైతులు హెచ్చరించారు. ఒక్క రాజధానికి ఒక్క ఇటుక ఎత్తలేని సీఎం, మూడు రాజధానులు నిర్మిస్తామని చెబితే ఎవరూ నమ్మరని అమరావతి జేఏసీ నేతలు విమర్శించారు. అమరావతి రాజధానిని మూడు ముక్కలు చేయడంతో రాజధాని ప్రాంతంలోని దళితులు తీవ్రంగా నష్టపోయారని, కనీసం వారికి కూలి పనికూడా దొరకడం లేదని పొలికేక అధ్యక్షుడు కోటయ్య విమర్శించారు. మూడు రాజధానుల నిర్ణయం తుగ్లక్ చర్యగా ఆయన అభివర్ణించారు. అమ్మలాంటి అమరావతి రాజధానికి సీఎం జగన్మోహన్ రెడ్డి మరణశాసనం రాశారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి అధికారానికి మరణశాసనం రాస్తారని టీడీపీ సీనియర్ నేత పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. ప్రభుత్వం అమరావతి రాజధాని విషయంలో మూర్ఖంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేత వంగవీటి రాధా విమర్శించారు. ప్రజల మద్దతు వల్లే రాజధాని పోరాటం సంవత్సరం నుంచి విజయవంతంగా సాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. అమరావతి ఉద్యమం 13 జిల్లాలకు విస్తరించిందని, అనేక మందిపై అట్రాసిటీ కేసులు పెట్టినా ఉద్యమం ఆగలేదని జనసేన నాయకుడు పోతుల రమేష్ స్పష్టం చేశారు.
Also Read ;- వారిపైనే ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రయోగమా.. పోలీసు శాఖపై ఏపీ హైకోర్టు ఆగ్రహం
రాయపూడిలో జనభేరి సభకు భారీ ఏర్పాట్లు
ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అంటూ అమరావతి రాజధాని రైతులు ఉద్యమం ప్రారంభించి 16వ తేదీకి సంవత్సరం పూర్తి కానుంది. ఈ సందర్భంగా అమరావతి రాజధానిలోని రాయపూడిలో 17వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించాలని అమరావతి జేఏసీ నిర్ణయించింది. ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతి రాజధానిలోని 29 గ్రామాల రైతులతోపాటు, రాష్ట్రం నలు మూలల నుంచి లక్ష మంది ఈ సభకు హాజరు అవుతారని అంచనా వేస్తున్నారు. రాయపూడి సభలో అమరావతి రాజధాని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. అధికార వైసీపీ మినహా అన్ని పార్టీల నేతలను రాయపూడి సభకు ఆహ్వానించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా రాయపూడి సభలో పాల్గొననున్నారు. అమరావతి రాజధానికి ప్రధాని మోడీ అంగీకరించినా, సీఎం జగన్ రెడ్డి మూడుముక్కలాట మొదలు పెట్టారని చంద్రబాబునాయుడు దుయ్యబట్టారు.
ఉక్కుపాదం మోపినా..
అమరావతి రాజధాని ఉద్యమాన్ని అణచివేయడానికి వైసీపీ ప్రభుత్వం చేయని కుట్ర లేదని జేఏసీ నేతలు విమర్శించారు. రాజధాని రైతులపై అక్రమంగా అట్రాసిటీ కేసులు పెట్టడంతోపాటు, రైతుల ఉద్యమానికి ప్రతిగా మూడు రాజధానుల ఉద్యమం చేయిస్తున్నారని వారు తప్పుపట్టారు. కేవలం విశాఖలో భూములు దోచుకుని అమ్ముకునేందుకే సీఎం మూడు రాజధానులను తెరమీదకు తెచ్చారని రైతులు తీవ్రంగా దుయ్యబట్టారు. మూడు రాజధానుల ప్రతిపాదన విరమించుకునే వరకు ఉద్యమం ఆగదని రైతులు స్పష్టం చేశారు. మూడు రాజధానుల ప్రకటన తరువాత అమరావతి గ్రామాల్లో వంద మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని అయినా రైతులు ఎక్కడా శాంతియుత మార్గం వీడలేదని టీడీపీ సీనియర్ నేత పత్తిపాటి పుల్లారావు కొనియాడారు. రాజధాని రైతుల ప్రాణత్యాగాలు ఊరికే పోవని మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజాసంఘాలు, పలు రాజకీయ పార్టీలు అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపారు.
Also Read ;- ‘ఒకే రాష్ట్రం ఒకేరాజధాని’ : మహాపాదయాత్రకు భారీ స్పందన