టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ వీడియో కాన్ఫరెన్సులో పోలీసుల పనితీరు గురించి తప్పుగా మాట్లాడారని పోలీసు అధికారుల సంఘం చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. పోలీసులపై కేసులు పెట్టండి, పోలీసులే కాళ్ల బేరానికి వస్తారు అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పడం చట్టాలను అతిక్రమించటమని, దుర్వినియోగ పరచమని ప్రోత్సహించడమే అవుతుందని ఏపీ పోలీసు అధికారుల సంఘం తప్పు పట్టింది. మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలా మాట్లాడటం సిగ్గుచేటని పోలీసు అధికారుల సంఘం అభిప్రాయపడింది. చంద్రబాబునాయుడు వ్యాఖ్యలపై పోలీసు అధికారుల సంఘం మీడియాకు ఓ లేఖను విడుదల చేసింది. పోలీసుశాఖ పనితీరును అభినందించాల్సిన చంద్రబాబు, పోలీస్ శాఖను అవమానించడం, డీజీపీని నిందించడం, దూషించడం ఆయన మానసిక స్థితిని తెలియజేస్తోందని పోలీసు అధికారుల సంఘం ఘాటుగా లేఖ విడుదల చేసింది.
Must Read ;- ఖాకీల కనుసన్నల్లోనే.. కాయ్ రాజా కాయ్!
పోలీసులా.. వైసీపీ కార్యకర్తలా?
ఏపీ పోలీసుల తీరు మరోసారి వివాదాస్పదంగా మారింది. రాజధాని రైతులపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని, రైతులు కూడా ఎదురు కేసులు పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ఏపీ పోలీసు అధికారుల సంఘం వక్రీకరించిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే తుళ్లూరు సీఐకి ఫోన్ చేసి నా కాళ్లు పట్టుకుని పోస్టింగ్ వేయించుకున్నావని మాట్లాడినప్పుడు ఈ అధికారులకు చట్టం గుర్తుకురాలేదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. కొవ్వూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి జిల్లా ఎస్పీని, కలెక్టర్‌ను బండ బూతులు తిట్టినప్పుడు పోలీసు అధికారుల సంఘాలకు చట్టాలు గుర్తుకు రాలేదా అని టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీ ప్రజాప్రతినిధులు పోలీసు అధికారులను వేధించినా, తిట్టినా నోరు మెదపని పోలీసు అధికారుల సంఘం నేతలు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ధ్వజమెత్తారు.
ఎవరు అధికారంలో ఉంటే వారికి భజన చేయాలా?
ఏపీ పోలీసు అధికారుల సంఘం తీరు ప్రతిసారీ వివాదాస్పదంగా మారుతోంది. సామాన్య ప్రజలు చెల్లించిన పన్నులతో జీతాలు తీసుకుంటున్న పోలీసు అధికారులు మానవాతీత వ్యక్తులుగా భావిస్తున్నట్టు అనుమానించాల్సి వస్తోందని వారు అంటున్నారు. ప్రజలకు తాము చేసే సేవ ప్రపంచంలో మరెవ్వరూ చేయడం లేదన్నట్టుగా వారి వ్యవహార శైలి తయారైందని ప్రజలు అనుమానించే పరిస్థితి వస్తోందంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి భజన చేయడమేనా పోలీసు అధికారుల పని అని జనం ప్రశ్నిస్తున్నారు. పోలీసు శాఖ, పోలీసులను ఎవరు తక్కువ చేసి మాట్లాడినా, వారిని కించ పరిచినా దాన్ని ఖండించే అధికారం పోలీసు అధికారుల సంఘానికి ఉంది. అయితే అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు పోలీసులను బండబూతులు తిట్టినా నోరు మెదపని పోలీసు అధికారుల సంఘం, ప్రతిపక్షంలో ఉన్నవారు తప్పు చేయకపోయినా, ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన వాటిని వక్రీకరించి ప్రజల ముందు వారు తప్పు చేస్తున్నారని చూపే ప్రయత్నం అధికార పార్టీకి సేవ చేయడంతో సమానమే అన్న అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఏ శాఖ సిబ్బంది అయినా పార్టీలకు అతీతంగా పని చేయాలని, ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరని వారు గ్రహిరంచాలంటున్నారు. రాజకీయ పార్టీలు ప్రభుత్వ సిబ్బందికి జీతాలు ఇవ్వడం లేదు. ప్రజలు దగ్గర నుంచి పన్నుల రూపంలో పిండిన డబ్బు ప్రభుత్వ సిబ్బందికి జీతాలుగా చెల్లిస్తున్నారని వారు అంటున్నారు. ప్రభుత్వంలో పని చేసే ఏ ఉద్యోగి అయినా ప్రజలకు జవాబుదారీ తనంగా ఉండాలి కానీ, అధికారంలో ఉన్న వారికి భజన చేసుకుని స్వప్రయోజనాలు నెరవేర్పుకోవడం ద్వారా ఆ శాఖలు పరువు పోతుందంటున్నారు. ఇప్పటికైనా పోలీసు అధికారుల సంఘం ఏ పార్టీ నేతలు తప్పుగా మాట్లాడినా స్పందిస్తారని ఆశిద్దాం.
Also Read ;- వారిపైనే ఎస్సీ, ఎస్టీ చట్ట ప్రయోగమా.. పోలీసు శాఖపై ఏపీ హైకోర్టు ఆగ్రహం