పొట్టచేతపట్టుకొని ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చే పేదలు ఎంతోమంది. కుటుంబ పోషణ కోసం కూలీగానో.. చిరు వ్యాపారిగానో పనిచేస్తూ జీవనోపాధి పొందుతుంటారు. లాక్ డౌన్ తో అలాంటివాళ్ల ఉపాధి కి బ్రేక్ పడింది. పని లేక ఇంటికే పరిమితమవుతుండటంతో పస్తులు ఉండే పరిస్థితి నెలకొంది. ఇలాంటివాళ్ల కష్టాన్ని చూసి చలించిపోయింది ఎర్త్లింగ్స్ ట్రస్ట్. ఆదాయం లేక నిత్యావసర సరుకుల కోసం ఇబ్బంది పడటం చూసిన ఎర్త్లింగ్స్ ట్రస్ట్ ఒక బృందంగా ఏర్పడింది. గ్రూపు సభ్యులంతా డబ్బులు సమకూర్చుకొని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.
హైదరాబాద్ లోని స్లమ్ ఏరియాలకు వెళ్తూ..పేదలను గుర్తిస్తూ వాళ్లకు కావాల్సిన సరుకులను పంపిణీ చేస్తోంది. ఈ క్రమంలో సాయం కోరిన ప్రతి కుటుంబానికి వారానికి సరిపడే సరుకులను అందిస్తోంది. ఇప్పటి వరకు దాదాపు ఇరు తెలుగు రాష్ట్రాల్లో యాభై కుటుంబాలకు సాయం చేసింది ఈ ట్రస్టు. సాయం పొందాలనుకునేవాళ్లు పేదలు ఎవరైనా సంప్రదిస్తే, వెంటనే సరుకులను అందిస్తోంది. కరోనా కష్టకాలంలో ఈ ట్రస్టు చేస్తున్న సేవలకు మంచి పేరు వస్తుండటంతో దాతలు కూడా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.
Must Read ;- సైకిల్ పై వెళ్తూ.. సాయం చేస్తూ : మానవత్వం చాటుకుంటున్న ఎమ్మెల్యే రామానాయుడు











