గొల్లపూడి మారుతీరావు మంచి రచయిత .. విలక్షణమైన నటుడు. సాహిత్యాభిరుచి కలిగిన కొంతమందికే ఆయన రచయితగా తెలుసు. కానీ తెలుగు తెర తెలిసిన వాళ్లందరికీ నటుడిగా ఆయన తెలుసు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన ఎన్నో విభిన్నమైన పాత్రలను పోషించారు. సైలెంట్ గా పనిముగించే విలాన్ గాను ఆయన మెప్పించారు. కొడుకులకు బుద్ధి చెప్పే తండ్రి పాత్రల్లో .. కోడళ్ల కళ్లు తెరిపించే మామ పాత్రల్లో నటుడిగా ఎన్నో ప్రశంసలను అందుకున్నారు. అలాంటి గొల్లపూడి క్రితం ఏడాది ఇదే నెలలో మరణించారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన తనయుడు రామకృష్ణ మాట్లాడారు. “మా నాన్నగారు మంచి మనసున్న మనిషి .. ఇంట్లో అందరం కూడా ఆయన మనసుకు కష్టం కలిగించకుండా నడుచుకునే వాళ్లం. ప్రతి విషయంలో మేము ఆయనను ఆదర్శంగా తీసుకునేవాళ్లం. ఆయనతో మాకు ఎంతో అందమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఆయనకి సంబంధించిన విషయాల్లో ఎలాంటి అసంతృప్తి లేదు. మనవాళ్లు .. మానవరాళ్లతో సంతోషంగా గడిపారాయన. కాకపోతే అంత హఠాత్తుగా ఆయన ఆరోగ్యం విషమించి చనిపోతారని అనుకోలేదు. ఆయన ఇంకా కొన్నాళ్లు ఉంటే బాగుండునని అనిపిస్తూ ఉంటుంది.
ఆర్ధికంగా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆర్థికపరమైన విషయాల్లో నాన్నగారు శోభన్ బాబుగారిని సంప్రదించేవారు. శోభన్ బాబు గారు చెప్పినట్టుగానే చేసేవారు. నేను కూడా అప్పుడప్పుడు నాన్నగారితో కలిసి శోభన్ బాబుగారి ఇంటికి వెళుతూ ఉండేవాడిని. ఆయన చాలా డీసెంట్ గా .. మల్లెపువ్వులా ఉండేవారు. భూమిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ చెడిపోడు అనే విషయాన్ని ఆయన పదే పదే చెబుతుండేవారు. ఎక్కడ .. ఎప్పుడు .. ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందనేది ఆయనకి బాగా తెలుసు. మేం ఆర్ధికంగా స్థిరపడటంలో ఆయన పాత్ర ఉంది. ఈ విషయంలో మా ఫ్యామిలీకి ఆయన చాలా హెల్ప్ చేశారనే చెప్పాలి” అని అన్నారు.
Must Read ;- గయ్యాళి అత్త .. అమాయకపు అమ్మ (సూర్యకాంతం వర్ధంతి ప్రత్యేకం)











