తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ కార్యాలయాలపై ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని నామా నివాసంతో పాటు, హైదరాబాద్ లోని నాగేశ్వరరావు ఇల్లు, కార్యాలయాల్లో ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు. నామాతో పాటు, రాంచీ ఎక్స్ ప్రెస్ వే సీఎండీ కె.శ్రీనివాసరావు, డైరెక్టర్లు ఎన్.సీతయ్య, ఎన్.పృథ్వీతేజ నివాసాల్లో కూడా ఏక కాలంలో సోదాలు చేస్తున్నారు. మధుకాన్ కంపెనీ వ్యాపారాల పేరుతో పలు బ్యాంకుల నుంచి రూ.1064 కోట్లు రుణాలు తీసుకుని నిధులు విదేశాలకు తరలించారనే ఆరోపణలపై ఈ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో 2019లోనే నామా నాగేశ్వరరావు, ఆయన కంపెనీలపై సీబీఐ కేసు నమోదు చేసింది.
నిధులు మళ్లించారా?
ముఖ్యంగా నిధుల మళ్లింపు కేసులో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. రాంచీ- జంషెడ్ పూర్ జాతీయ రహదారి 33 నిర్మాణ పనుల కోసం మధుకాన్ లిమిటెడ్ పలు బ్యాంకుల నుంచి రూ.1064 కోట్లు రుణాలు తీసుకుంది. ఆ నిధులను జాతీయ రహదారి నిర్మాణాలకు వాడకుండా విదేశాలకు తరలించారని సీబీఐ కేసు నమోదు చేసింది. ఏళ్లు గడచినా పనుల్లో పురోగతి లేకపోవడంతో సీబీఐ, ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. గత ఏడాది రాంచీ -జంషెడ్ పూర్ పనుల నుంచి కూడా మధుకాన్ కంపెనీని తొలగించారు. కంపెనీ డైరెక్టర్లపై కూడా సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మధుకాన్ ఆడిటర్లపై కూడా కేసులు నమోదయ్యాయి.
Must Read ;- రఘురామరాజు కేసులో సీబీఐ,కేంద్రానికి సుప్రీం నోటీసులు