నటసింహ నందమూరి బాలకృష్ణ .. ఇప్పటివరకూ 105 సినిమాల్లో నటించారు. ఇన్నేళ్ళ కెరీర్ లోనూ అద్భుతమైన పాత్రలు పోషించారు. ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అయితే ఆయన జీవితంలో ఒకటే వెలితిగా మిగిలిపోయింది. అదేనండీ .. దర్శకత్వం. దాదాపు 16 ఏళ్ల క్రితం ‘నర్తన శాల’ అనే మూవీతో తన దర్శకత్వ కలను తీర్చుకోవాలని ముచ్చటపడ్డారు. అయితే అప్పట్లో సౌందర్య అకాల మరణంతో ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ బాలకృష్ణ దర్శకత్వ ఆలోచన చేయలేదు.
అయితే త్వరలోనే బాలయ్య బాబు .. మెగాఫోన్ పట్టుకోనున్నాడనే వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అది కూడా తన నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ మూవీతో. నందమూరి ఫ్యామిలీ లో దాదాపు గా యన్టీఆర్ అందరి వారసులూ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. అభిమానులు అతడి ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ కూడా అతడి ఎంట్రీ మీద ఇప్పటి వరకూ స్పష్టమైన సంకేతాలు ఏమీ రివీల్ చేయలేదు. ఇప్పుడు త్వరలోనే ఆ సమయం ఆసన్నమైందని టాలీవుడ్ టాక్.
దీనికి కారణమేంటంటే.. ఇటీవల బాలయ్య ఒక ఇంటర్యూలో తాను త్వరలోనే ఆదిత్య 369 కి సీక్వెల్ చేస్తున్నానని, , అందులో మోక్షజ్ఞ, తాను నటిస్తున్నామని చెప్పారు. దాంతో అభిమానులు ఆనందాన్ని పట్టలేకపోతున్నారు. కథ ఎలాగూ బాలయ్యే అందిస్తున్నారు కాబట్టి దీనికి బాలకృష్ణే దర్శకత్వం వహిస్తారని అంటున్నారు. ఏదేమైనా .. మోక్షజ్ఞ ఎంట్రీ ఓ సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ కానుండడం విశేషంగా మారింది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.
Must Read ;- బర్త్ డే సర్ ప్రైజ్ : బాలయ్య- గోపీచంద్ మలినేని మూవీ అనౌన్స్ మెంట్