ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందాలనే దురుద్దేశంతో నిబంధనలకు విరుద్ధంగా దుష్టపన్నాగం పన్నిన వైఎస్ జగన్‌కు షాక్ తగిలింది. ఎన్నికల విధులకి టీచర్ల స్థానంలో సచివాలయ ఉద్యోగులని నియమించాలని భావించిన జగన్‌కి ఊహించని షాక్ తగిలేలా ఉంది ఏపీకి వచ్చిన కేంద్ర ఎన్నికల అధికారులు సచివాలయ ఉద్యోగులను దూరం పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. టీచర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచుతున్నామని.. సచివాలయ ఉద్యోగుల జాబితాను ఇప్పటికే ప్రభుత్వం ఎన్నికల కమిషన్‌కు పంపింది. టీచర్లకు బోధనేతర బాధ్యతల నుంచి తప్పిస్తున్నామని, దీనివల్ల వారిపై ఇతర బాధ్యతల ఒత్తిడి తగ్గి పిల్లలకు చదువు చెప్పడంపైనే ఫోకస్ చేస్తారని జగన్ నమ్మబలికింది. కానీ, దీని వెనక అసలు కుట్ర వేరే ఉంది.
టీచర్లు కాకుండా సచివాలయ ఉద్యోగులు అంతా ఎన్నికల విధుల్లో ఉంటే తన గెలుపునకు సహకరిస్తారని జగన్ భావిస్తున్నారు. అయితే ఉద్యోగుల ట్రాన్స్‌ఫర్ లకు సంబంధించి గత డిసెంబరులో ఎన్నికల సంఘం ఇచ్చిన గైడ్ లైన్స్ తో ఈ జగన్ వ్యూహం బూమరాంగ్ అయ్యేలా కనిపిస్తుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు మూడేళ్ల సర్వీసు పూర్తిచేసి ఉంటేనే వారిని ఇతర జిల్లాలకు ట్రాన్స్ ఫర్ చేయాలని ఈసీ గైడ్ లైన్స్ లో స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1.26 లక్షల మంది సచివాలయ కార్యదర్శులు గత నాలుగేళ్ల నుంచి ఒకేచోట పనిచేస్తున్నారు. వీరికి బదిలీ అవకాశం ఇస్తామని చెప్పిన వైసీపీ సర్కారు గతేడాది నామమాత్రంగా 10 శాతం లోపే ట్రాన్స్‌ఫర్ చేసింది. ఈ ఉద్యోగులు కూడా బదిలీల కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ వ్యూహం ప్రకారం వారందరికీ ఎన్నికల విధులు అప్పగించాలటే ఈసీ నిబంధనలను అనుసరించి మొత్తం 1.26 లక్షల మంది సచివాలయ ఉద్యోగులను బదిలీ చేయాల్సి ఉంది. ఇప్పటికిప్పుడు అంత మందిని ఒకేసారి డివిజన్ లేదా జిల్లా మార్చడం సాధ్యం కాని పని.
పైగా సచివాలయాల సెక్రటరీల స్థాయి అసిస్టెంట్ కేడర్. వారికి అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ బాధ్యతలు మాత్రమే ఇవ్వగలరు. పోలింగ్ ఆఫీసర్‌గా కచ్చితంగా గెజిటెడ్ అధికారిని మాత్రమే ఉండాలి. అప్పుడు ఈ ఉద్యోగులెవరూ ఎన్నికల అధికారి పోస్టుకు అర్హులు కారు. పైగా ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులందరినీ వేరే సచివాలయాలకు మార్చాల్సి ఉంటుంది. అయితే ఇంతమందిని మూకుమ్మడిగా బదిలీ చేయడం అసాధ్యం. పైగా అరకొర జీతాలు ఇస్తున్న ప్రభుత్వానికి వారు సహకరిస్తారా అనే అనుమానం కూడా ఉంది.
ఈ క్రమంలోనే ఎన్నికల విధులకు టీచర్లను వినియోగించుకోవడం కాక మరో దారి ప్రభుత్వానికి కనిపించడం లేదు. సచివాలయ సిబ్బంది కాకుండా మిగతా ఉద్యోగులందరూ తమకు వ్యతిరేకంగా పనిచేస్తారని, ఎన్నికల్లో తమ ఓటమికి పని చేస్తారనే ఆందోళన ప్రభుత్వంలో ఉంది. ఎందుకంటే పీఆర్సీ, రిటైర్ మెంట్ ప్రయోజనాల విషయంలో ఉద్యోగులకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపించిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు, టీచర్లు, కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేసినా ప్రభుత్వం దిగిరాలేదు. పైగా పీఆర్సీ ఇస్తామని చెప్పి కూడా.. అదీ లేదు. దీంతో వీరంతా ఎన్నికలొస్తే వైసీపీ సర్కారును ఓడిద్దామనే నిశ్చయంతోనే ఉన్నారు.










