ఏపీలో ఇప్పుడంతా ఎన్నికల కోలాహలమే నెలకొంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి కాగా.. శనివారం నాడు బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. మంగళవారం నాడు ఈ ఎన్నిక ఫలితం తేలనుంది. తాజాగా నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్ సహా 12 మునిసిపాలిటీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్ సోమవారం నాడు షెడ్యూల్ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు. ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మునిసిపాలిటీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ దఫా ఎన్నికల్లో అన్నింటికంటే కుప్పం ఎన్నికపైనే అందరి దృష్టి కేంద్రీకృతం కానుంది. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం పరిధిలోని మెజారిటీ స్థానాలను చేజిక్కించుకున్న వైసీపీ.. ఇప్పుడు కుప్పం మునిసిపాలిటీని కూడా కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. అయితే వైసీపీ వ్యూహాలను తుత్తునీయలు చేసేలా చంద్రబాబు కూడా ఈ ఎన్నికపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే కుప్పంలో రెండు రోజుల పాటు పర్యటించిన చంద్రబాబు కుప్పం మునిసిపల్ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేశారు. చంద్రబాబు టూర్‌తో తెలుగు తమ్ముళ్లు కూడా రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. వెరసి తనదైన మార్కు దౌర్జన్యాలతో విజయం సాధించిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీకి కుప్పం పుర పోరులో చుక్కలు కనిపించడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
పుర పోరు ఇలా..
నెల్లూరు కార్పోరేషన్ తో పాటుగా 12 మున్సిపాల్టీలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయింది. దీని పై ఇప్పటికే జిల్లా స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ఖరారు చేసింది. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈ నెల 14,15,16 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. గతంలో ఎన్నికలు జరగని ప్రాంతాలతో పాటుగా..గెలిచిన అభ్యర్ధులు మరణించిన మున్సిపల్, పంచాయితీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి.షెడ్యూల్ ప్రకారం నెల్లూరు కార్పొరేషన్ తో పాటుగా 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగే మున్సిపాల్టీలు..ఆకీవీడు, జగ్గయ్యపేట, కొండపల్లి, దాచేపల్లి, గురజాల, దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, కుప్పం, బేతంచర్ల, కమలాపురం,రాజంపేట, పెనుకొండ లో ఎన్నికల జరగనున్నాయి. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుంచి 5వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నెల్లూరు కార్పోరేషన్ తో పాటుగా మున్సిపాల్టీలకు ఈనెల 15న పోలింగ్ జరగనుంది. 17వ తేదీన మున్సిపాల్టీలు, కార్పోరేషన్లకు కౌంటింగ్ నిర్వహిస్తారు. ఇదే విధంగా14వ తేదీన పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 16వ తేదీన ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికల నిర్వహాణకు నిర్ణయించారు.18వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కౌంటింగ్ జరగనుంది.
త్రిలోక్ వర్సెస్ సుధీర్
కుప్పం మొన్నటిదాకా మేజర్ పంచాయతీనే. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక.. ఆ పంచాయతీని మునిసిపాలిటీగా అప్ గ్రేడ్ చేశారు. కుప్పంలో చంద్రబాబు హవాను తగ్గించే దిశగా జగన్ సర్కారు రచించిన వ్యూహంలో భాగంగానే కుప్పంను మునిసిపాలిటీగా మార్చారన్న వాదనలు లేకపోలేదు. ఇదే వాదనను ఇటీవలి పర్యటనలో చంద్రబాబు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. కుప్పం పట్టణంలో వైసీపీ అభ్యర్థి చైర్మన్‌గా ఉంటే.. వచ్చే ఎన్నికల నాటికైనా చంద్రబాబు హవాను తగ్గించవచ్చన్నది వైసీపీ వ్యూహంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కుప్పం మునిసిపల్ ఎన్నికలు ఎప్పుడు జరపాలన్న విషయంపై ఓ స్పష్టత వచ్చిన తర్వాత ఇటీవలే కుప్పంలో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. కుప్పం మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్‌ను ప్రకటించారు. తాజాగా చంద్రబాబు కూడా టీడీపీ అభ్యర్థిగా పార్టీకి చెందిన యువ నేత త్రిలోక్‌ను ప్రకటించారు. వెరసి కుప్పంలో టీడీపీ, వైసీపీల మధ్య కొనసాగనున్న హోరాహోరీ పోరులో త్రిలోక్ వర్సెస్ సుధీర్ బరి ఆసక్తిని రేకెత్తించనుంది.
Also Read : ‘లియో’ చెప్పినట్టే!.. టీడీపీ వెంటే వైసీపీ!