రాష్ట్రంలో 2014 నుంచి 2020 వరకు 1,32,899 ఉద్యోగాలను భర్తీ చేశామని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ , ఐటీ మంత్రి కేటీఆర్ గురువారం బహిరంగ లేఖ విడుదల చేయడంతో పాటు కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. దీంట్లో ఏవైనా తప్పులుంటే చూపెట్టాలని, చర్చకు కూడా సిద్ధమని సవాలు విసిరారు. అయితే వెంటనే కాంగ్రెస్ రియాక్ట్ అయింది. ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్ కుమార్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఫిబ్రవరి 26న గన్ పార్క్ తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద చర్చకు సిద్ధమని చెప్పారు. ఆ మేరకు శుక్రవారం ఉదయం గన్ పార్క్ వద్దకు వచ్చారు. ప్రభుత్వం నుంచి చర్చకు ఎవరైనా వస్తారా అని సవాల్ విసిరారు. కాగా అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తూ..సీట్లు కావాలంటే తీసుకోండి..ఎమ్మెల్సీలు కావాలంటే మీరే తీసుకోండి..కాని సీట్ల కోసం ఇంత పచ్చి అబద్దాలు ఆడతారా.. నిరుద్యోగుల బతుకులతో ఆటలాడుకుంటారా అని ప్రశ్నించారు
దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలు ఇవీ..
‘తెలంగాణ ఎవరి త్యాగాల వల్ల వచ్చిందో కేసీఆర్ విస్మరించారు. కరోనా కారణంగా ఉద్యోగాలు పోయినవారిని పట్టించుకోవడం లేదు. వేలాది మంది ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలు పీకేసి రోడ్డున పడేశారు. ఈ రోజు ప్రగల్భాలు పలుకుతున్నార. కిరణ్ కుమార్‌రెడ్డి హయాంలో ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. మీరు గ్రూప్స్ నోటిఫికేషన్లు విడుదల చేయలేదు. ఒక్క డీఎస్సీ వేసి మోసాలు చేస్తున్నారు. గేమింగ్, యానిమేషన్ టవర్స్ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రతిపాదిస్తే..కేటీఆర్ ఆ విభాగాన్ని సర్వనాశనం చేశారు. ఐటీఐఆర్‌ని కూడా నిర్వీర్యం చేశారు అయినా కేటీఆర్ ఉత్తమ మంత్రిగా అవార్డు తీసుకున్నారు. భేషజాలకు పోయి..ఐటీఐఆర్‌ని నిర్వీర్యం చేశారు. రూ.13వేల కోట్లు పెడితే ఐటీఐఆర్ వచ్చేది. అది కూడా ఇవ్వలేదు. 50వేల ఎకరాలను కాంగ్రెస్ ప్రభుత్వం గతంలోనే కేటాయించింది. గత ఏడేళ్లలో బడ్జెట్ , అప్పులు కలిపి ఖర్చుచేసినట్లుగా చెబుతున్నా రూ. 18లక్షల కోట్లలో 13వేల కోట్లు ఖర్చుచేస్తే యువతకు ఉపాధి దక్కేది. వేలాది యువత తమ కాళ్లపై తాము నిలబడేవారు. రేషన్ డీలర్ల బతుకులు రోడ్డున పడ్డాయి. ఆదర్శ రైతు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. కొత్త ఉద్యోగాలివ్వకుండా ఉన్న ఉద్యోగాలు పోయినా పట్టించుకోలేదు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 1.97లక్షల ఖాళీలున్నాయని నివేదికలున్నాయి. మరో 1.1లక్షల కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. మొత్తం 3లక్షల ఉద్యోగాలు కాకుండా కొత్త జిల్లాలకు గాను మరో లక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అసెంబ్లీ సీట్లు కావాలంటే తీసుకోండి. తూ..మీకు సీట్లు కావాలంటే..ఎమ్మెల్సీలనూ తీసుకోండి. అసెంబ్లీలో మీరే కూర్చోండి. కాని యువతను తప్పుదోవపట్టించే విధంగా ఇంత దారుణ అబద్దాలు చెప్పొద్దు. చర్చకు మేం ముందుకొచ్చాం. మీరు ఇళ్లల్లో కూర్చున్నారు. అయినా మా ఉద్యమం ఆగదు. యువజన విభాగాలు ఇక నుంచి ఉద్యమ బాటలో పయనిస్తాయి’ అని వ్యాఖ్యానించారు.
Must Read ;- మారని టీ కాంగ్రెస్ తీరు.. ఆపరేషన్ ఆకర్ష్‌కు బీజేపీ పదును
లక్షా ముఫ్పై వేల ఉద్యోగాలకుపైగా భర్తీ చేశామన్న కేటీఆర్..
కాగా లక్షా ముఫ్పై వేల ఉద్యోగాలకుపైగా భర్తీ చేశామని కేటీఆర్ ప్రకటించారు. ఆరేళ్లలో జరిగిన ఉద్యోగాల భర్తీ 1,32,899, శాఖల వారీగా భర్తీ చేసిన పోస్టుల వివరాలను కూడా తన లేఖలో కేటీఆర్ వెల్లడించారు. ప్రైవేటు రంగంలో కల్పించినవి మరో 14లక్షలు ఉంటాయని ఆ లేఖలో పేర్కొనడంతో ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడింది. అటు అధికార పార్టీ , ఇటు ప్రతిపక్ష పార్టీల సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఎమ్మెల్సీ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. మొత్తం మీద ఉద్యోగాల ఇష్యూలో ఎమ్మెల్సీ అభ్యర్థుల కంటే కాంగ్రెస్ పార్టీ కేటీఆర్‌ను చర్చలోకి లాగిందని చెప్పవచ్చు.
Must Read ;- సవాళ్లు, ప్రతి సవాళ్లు.. తెలంగాణలో ‘గ్రాడ్యూయేట్’ హీట్