గాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తేదీలు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీల సవాళ్లు , ప్రతి సవాళ్లు పెరుగుతున్నాయి. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత రాజకీయ హీట్ పెంచాయి. నిరుద్యోగ సమస్యలపై వైరి పక్షాలు అధికార టీఆర్ఎస్‌ను టార్గెట్ చేస్తున్నాయి. అదే సమయంలో టీఆర్ఎస్ కూడా తమ ప్రభుత్వం హయాంలో ఏయే కంపెనీలు ఏర్పాటయ్యాయో కూడా వివరిస్తోంది. ఇక అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల పరిధిలో వీలైనంతవరకు ఓటర్లను కలిసే యత్నం చేయడంతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఖమ్మం-నల్గొండ-వరంగల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌లో బీజేపీ నుంచి రామచందర్ రావు సిట్టింగ్‌గా ఉన్నారు. ఈ పట్టు నిలుపుకునేందకు ఆయా పార్టీలు ప్రయత్నిస్తుండగా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్థానాల్లో గెలుపు రానున్న ఎన్నికలకు కీలకం అవుతుందని ఇతర పార్టీలూ అంతే ప్రయత్నిస్తున్నాయి.
భారీగా పోటీ..
ఖమ్మం-నల్గొండ-వరంగల్ నియోజకవర్గంలో మొత్తం 78 నామినేషన్లు దాఖలయ్యాయి. గతంలో ఇక్కడ 30 నామినేషన్లు దాఖలు కాగా ఈ సారి భారీగా పెరిగాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, లెఫ్ట్ పార్టీల అభ్యర్థి జయసారథిరెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను బరిలోకి దింపింది. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లాకు మద్దతుగా మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి తదితరులు సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక గత ఎన్నికల్లో రెండోస్థానంలో నిలిచిన బీజేపీ ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. అందుకు ప్రతి 25 మంది ఓటర్లకు ఒక ఇన్‌ఛార్జిని నియమించి, మూడు జిల్లాల్లో సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌ను ప్రకటించిన కాంగ్రెస్.. ప్రచారంలో స్పీడ్ పెంచింది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి , జీవన్ రెడ్డి తదితరులు సభలతో హోరెత్తిస్తున్నారు. వీరు కాకుండా టీజేఎస్ నుంచి కోదండరాం, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమ, తెలంగాణ ఇంటి పార్టీ నుంచి చెరకు సుధాకర్, జర్నలిస్టు తీన్మార్ మల్లన్న, వామపక్షాల నుంచి జయసారథిరెడ్డి తదితరులు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. అయితే 2015 ఎన్నికలతో పోలిస్తే ఈసారి పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నియోజకవర్గంలో గతంలో 2 లక్షల 81 వేల138 మంది ఓటర్లు ఉండగా ఈసారి 5.05లక్షలకు పెరిగింది.
Must Read ;- టీఆర్ఎస్ వ్యూహాత్మక జాప్యం.. వైరి పక్షాలకు కేసీఆర్ షాక్
పెరిగిన ఓటర్లతో అభ్యర్థుల్లో టెన్షన్
ఇక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోనూ పోటీ భారీగా ఉంది. ఓటర్లు కూడా గణీయంగా పెరిగారు. ఇక్కడ గతంలో 3.2లక్షల ఓట్లరు ఉండగా ఇప్పుడు 5.31లక్షల ఓటర్లు నమోదు చేసుకున్నారు. దీంతో అభ్యర్థుల్లోనూ కొంత టెన్షన్ నెలకొంది. ఇక్కడ వందకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నుంచి పీవీ కుమార్తె సురభి వాణి దేవి, కాంగ్రెస్ నుంచి చిన్నారెడ్డి, బీజేపీ నుంచి రామచందర్‌రావు, ఆర్ ఎల్ డీ నుంచి కపిలవాయి దిలీప్ కుమార్, టీడీపీ నుంచి ఎల్ రమణ, స్వతంత్ర అభ్యర్థిగా నాగేశ్వర్ తదితరులు పోటీలో ఉన్నారు. మొన్నటి వరకు బీజేపీ, కాంగ్రెస్, ఫ్రొఫెసర్ నాగేశ్వర్ మధ్య త్రిముఖ పోటీగా కనిపించగా.. టిఆర్ఎస్ అనూహ్యంగా పీవీ కుమార్తె వాణిదేవిని అభ్యర్థిగా నిలబెట్టడంతో ఒక్క సారిగా రాజకీయ సమీకరణలు మారుతున్నాయి.
సవాళ్లు..ప్రతి సవాళ్లు..
ఈ ఎన్నికల్లో పార్టీలు పరస్పరం సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి. బుధవారం కేటీఆర్ మాట్లాడుతూ గత ఆరేళ్లలో 1.32లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని వ్యాఖ్యానించారు. ఉద్యోగాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దీనిపై బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు స్పందిస్తూ.. కేటీఆర్ మాటలన్నీ అసత్యాలేనని, కేటీఆర్ ప్రచారంపై చర్చించేందుకు ఉస్మానియాకు రావాలని సవాలు విసిరారు. అమేజాన్, గూగుల్ వంటిని కేంద్ర ప్రభుత్వ విధానాలను చూసి వచ్చాయని, కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసి కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తమ్, రేవంత్ తదితరులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దుమ్మెత్తి పోశారు. ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో స్పష్టంగా చెప్పాలని, ఎన్ని కంపెనీలు వచ్చాయో చెప్పకుండా అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. నిరుద్యోగ భృతి హామీ ఏమైందని ప్రశ్నించారు.
Also Read ;- టీఆర్ఎస్ అక్రమాలపై సీబీఐ ఎంక్వైరీ.. తరుణ్ చుగ్ సంచలన వ్యాఖ్యలు