ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే సమ్మెకు దిగుతాం!
కృష్ణపట్నం థర్మల్ విద్యుత్కేంద్రాన్ని 25 ఏళ్ల పాటు లీజుకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి డిమాండ్ చేసింది. అలా కాదని.. ముందుకు అడుగులు వేస్తే దశలువారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించింది. అలానే మొండి వైఖరిని ప్రదర్శించి ప్రైవేటీకరణ చేయాలని చూస్తే మెరుపు సమ్మెలోకి వెళతామని స్పష్టం చేసింది. మార్చి రెండో తేదీ నుంచి విద్యుత్తు యాజమాన్యం కేటాయించిన సెల్ఫోన్ సిమ్ కార్డును వాపస్ చేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు చేసింది. కృష్ణపట్నం ప్లాంటును ప్రైవేటు పరం చేయొద్దంటూ విద్యుత్ సౌధలో ఏపీ ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ( హెచ్ఆర్ ) పృథ్వీతేజ్ ను కలిసి విద్యుత్తు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్, సెక్రటరీ జనరల్ ప్రతాపరెడ్డి, కన్వీనర్ సాయికృష్ణ నోటీసు అందజేశారు.
నేటి నుంచి ఆందోళనలు..
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉత్పాదక కేంద్రాలు, డివిజన్, సర్కిల్, జోనల్ కార్యాలయాలు, ఏపీ జెన్కో, ట్రాన్స్ కో, ఏపీ డిస్కమ్ ల కార్పోరేట్ ఆఫీసులలో ఆందోళనలు నిర్వహిస్తామని నోటీసులో విద్యుత్తు ఉద్యోగులు హెచ్చరించారు. శనివారం విద్యుత్ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవుతారని, తరువాత సామాజిక మాధ్యామాలు, పోస్టు కార్డుల ద్వారా ముఖ్యమంత్రికి అభ్యర్థనలు పంపుతామని తెలిపారు. ఫిబ్రవరి 3 తేదీ నుంచి ఐదో తేదీ వరకూ స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పిస్తామన్నారు. 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ వర్క్ టు రూల్.. రీలే నిరాహార దీక్షలు చేస్తామన్నారు. అప్పటికీ భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తూ మెరుపు సమ్మెకు దిగుతాం అని నోటీసులో జేఏసీ నేతలు స్పష్టం చేశారు.










