టీమిండియా స్పిన్ మాయాజాలం కొనసాగుతోంది. బౌలర్ల హవా నాలుగో టెస్టులోనూ పునరావృతమైంది. భారత స్పిన్నర్ల దాటికి ఇంగ్లాండ్ మరోసారి అతలాకుతలమైంది. నరేంద్ర మోడీ స్టేడియంలో గురువారం జరిగిన నాలుగో టెస్టు తొలిరోజు ఆటలో ఇంగ్లీష్ జట్టు 205 పరుగులకే కుప్పకూలింది.
మరోసారి తడబడిన ఇంగ్లాండ్
మొతేరా వేదికగా టీమిండియా– ఇంగ్లాండ్ సిరీస్‌లో నిర్ణయాత్మక టెస్టులో ఇంగ్లాండ్ మరోసారి తడబడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 75.5 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ (4), రవిచంద్రన్ అశ్విన్(3) ఇంగ్లీష్ జట్టుపై మరోసారి ఆధిపత్యాన్ని కొనసాగించారు. తమదైన వైవిధ్యం ప్రదర్శిస్తూ చక్కని స్పిన్‌తో ప్రత్యర్థి జట్టును వణికించారు.మహ్మద్ సిరాజ్ (2) కీలకమైన వికెట్లు పడగొట్టారు. ఇంగ్లాండ్ జట్టులో బెన్‌స్టోక్స్ (55), డేనియెల్ లారెన్స్ (46) టాప్ స్కోరర్లు. జోరూట్ (5) మరోసారి విఫలమయ్యారు.
ఒక వికెట్.. 24 పరుగులు
నాలుగో టెస్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 24 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (8), చెతేశ్వర్ పుజారా (15) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. ఓపెనర్ శుభ్ మన్ గిల్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే డకౌట్‌గా వెనుదిరిగారు. భారత్ ఇంకా 181 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో మరో తొమ్మిది వికెట్లు ఉన్నాయి.
Must Read ;- మాల్దీవుల్లో చాహల్,ధనశ్రీ.. సేదతీరుతున్న కొత్త జంట