ఓ వైపు నేతల వరుస రాజీనామాలతో సతమతవుతున్న వైసీపీకి ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గ విబేధాలు ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో నేతల మధ్య వార్ హాట్ టాపిక్‌గా మారింది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డైలాగ్ వార్ నడుస్తోంది. ఇద్దరు నేతలు అభిమానులు సోషల్‌మీడియా వేదికగా దుమ్మెత్తి పోసుకుంటున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా మాధవ్ ఏర్పాటు చేసిన విందుతో ఈ గ్రూప్ వార్ మొదలైంది. తర్వాత బహిరంగ విమర్శలు, సస్పెన్షన్లు, రాజీనామాలకు వరకు వెళ్లింది.
కొందరు నాయకులు ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పని చేశారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ఐతే ఈ వ్యాఖ్యలపై స్పందించిన గోరంట్ల మాధవ్ అనుచరులు పార్టీలోని బీసీలు అన్యాయానికి గురవుతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో కౌంటర్లు పెడుతున్నారు. ప్రస్తుతం వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న గోరంట్ల మాధవ్..రాప్తాడు నియోజకవర్గంపై దృష్టి పెట్టడంతో వర్గపోరు కాస్త ఆధిపత్య పోరుగా మారిపోయింది.
ఈ ఏడాది జనవరి 1న రామగిరికి చెందిన కొందరు స్థానిక నాయకులు గోరంట్ల మాధవ్‌కు రాప్తాడు బాధ్యతలు అప్పగిస్తారంటూ ప్రచారం చేశారు. ఈ ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పార్టీ నుంచి వారిని సస్పెండ్ చేయించారు. రామగిరి మండలంలో బీసీ సామాజికవర్గానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకుల్లో అసంతృప్తి పెరిగినట్లు సమాచారం. తమకు ప్రకాష్ రెడ్డి నాయకత్వం వద్దని అంతర్గత సమావేశాల్లో నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు రామగిరి జడ్పీటీసీ సభ్యుడు నాగార్జునతో పాటు, కుంటిమద్ది సర్పంచ్, ఎంపీటీసీ పార్టీకి రాజీనామా చేసేందుకు రెడీ అయినట్లుగా సోషల్‌మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి.
రాప్తాడు నియోజకవర్గంలో తన సామాజికవర్గం కురబల ఓట్లు అత్యధికంగా ఉండడంతో ఆ సీటును చేజిక్కించుకునేందుకు గోరంట్ల ప్రయత్నాలు చేస్తున్నారు. తన సామాజికవర్గం నాయకుల మద్దతును కూడగట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. కూటమి ప్రభుత్వం, పరిటాల కుటుంబంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. రాప్తాడు వైసీపీలోని కురబ నాయకులను తనవైపు తిప్పుకునేందుకు రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
2019లో హిందూపురం ఎంపీగా గెలిచిన గోరంట్లకు వరుస వివాదాల కారణంగా 2024 ఎన్నికల్లో ఎంపీ సీటు నిరాకరించింది వైసీపీ అధిష్టానం. న్యూడ్ వీడియోకాల్‌తో పాటు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ గతంలో వార్తల్లో నిలిచారు గోరంట్ల. నిజానికి గోరంట్ల మాధవ్ సొంత జిల్లా కర్నూలు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో కురబ సామాజికవర్గం ఎక్కువగా ఉన్న పత్తికొండ నియోజకవర్గంను టార్గెట్ చేశారు. కానీ చివరకు ఆ సీటు కూడా దక్కలేదు.