టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైసీపీపై విరుచుకుపడితే.. ఆ పార్టీ నేతనంటూ ఎంట్రీ ఇచ్చేసిన టాలీవుడ్ ప్రముఖ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఎదురు దాడి మొదలెట్టేశారు. వీరి మధ్య సాగుతున్న మాటల యుద్ధం మంగళవారం నాడు హద్దులు దాటేసింది. ఇరు వర్గాల నుంచి బూతులు నాట్యం చేస్తున్న వైనం నిజంగానే కంపరం పుట్టిస్తోందని చెప్పక తప్పదు. రాజకీయాలు వదిలేసి.. వ్యక్తిగత విషయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసిన వీరి మాటలు ఇప్పుడు మరింత ఘాటెక్కాయనే చెప్పాలి. అంతేకాకుండా మంగళవారం సాయంత్రం ఈ రెండు వర్గాల మధ్య బాహాబాహీ తప్పదా? అన్నట్లుగా హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ పోలీసులు సరైన సమయంలో స్పందించారు కాబట్టి సరిపోయింది గానీ.. పీకే ఫ్యాన్స్ చేతిలో పోసాని భౌతిక దాడికి కూడా గురయ్యేవారే. అప్పటికే ఒకరిద్దరు పవన్ ఫ్యాన్స్ వచ్చి హంగామా చేసినా.. పోలీసులు వారిని నిరోధించారు. ఆ తర్వాత పోసాని అక్కడి నుంచచి బయలుదేరుతున్న సమయంలో ఎక్కడున్నారో గానీ.. ఒక్కసారిగా పలువురు పవన్ ఫ్యాన్స్ పోసానిపై దాడికి యత్నించారు. అయితే అప్పటికే భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ దాడిని నివారించారు.
వ్యక్తిగత దూషణల పర్వం
వైసీపీ సర్కారుపై పవన్ చేసిన వ్యాఖ్యలపై ఓ వైపు ఏపీ మంత్రులు వరుసబెట్టి కౌంటర్లు ఇస్తుంటే.. పవన్ కూడా వారి కౌంటర్లకు ప్రతి కౌంటర్లు సంధిస్తున్నారు. ఇలాంటి క్రమంలో సోమవారం నాడు మీడియా ముందుకు వచ్చేసిన పోసాని.. పవన్ ను టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యల్లో వ్యక్తిగత అంశాలు అంతగా లేకున్నా.. ఓ యువతిని పవన్ గర్భవతిని చేశారంటూ పోసాని నోరు జారారు. ఈ కామెంట్లు విన్నంతనే.. పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోసానిని బండ బూతులు తిట్టడం మొదలెట్టారట. అంతేకాకుండా నేరుగా పోసానికే ఫోన్ చేసి బెదిరింపులకు దిగారట. ఈ సందర్భంగా పోసాని ఫ్యామిలీ మెంబర్ల ప్రస్తావనను తీసిన పవన్ ఫ్యాన్స్ అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేశారట. దీంతో వరుసగా రెండో రోజైన మంగళవారం మీడియా ముందుకు వచ్చిన పోసాని.. పవన్‌ను నేరుగా టార్గెట్ చేస్తూ రాయడానికి వీల్లేని పదజాలంతో దూషించారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్ వేదికగా జరుగుతున్న పోసాని ప్రెస్ మీట్ ను లైవ్‌లో చూసిన జనసైనికులు, పవర్ స్టార్ ఫ్యాన్స్ ఒక్కరొక్కరుగానే అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని ముందుగానే అంచనా వేసిన పోలీసు అధికారులు అప్పటికే అక్కడికి భారీ ఎత్తున బలగాలను మోహరించారు. ఈ క్రమంలో ఒకరిద్దరు జనసైనికులను పోలీసులు అప్పటికే అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించినా.. సరిగ్గా పోసాని బయటకు వస్తున్న సమయంలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆయనపైకి దూకారు. అయితే అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు వారిని అదుపు చేసి వారి దాడి నుంచి పోసానిని కాపాడారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పోసానికి ఏమైనా పీకేదే బాధ్యతట
పీకే ఫ్యాన్స్, జనసైనికులను అక్కడి నుంచి తరలించిన పోలీసులు.. పోసానిని పోలీసు ఎస్కార్ట్ తో అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా పీకే ఫ్యాన్స్ దాడితో భీతిల్లిపోయిన పోసాని పోలీసు వ్యాన్‌లో చప్పుడు చేయకుండా కూర్చుండిపోయారు. ఆ తర్వాత మీడియాతో మరోమారు మాట్లాడిన పోసాని.. పవన్ కల్యాణ్ తన అభిమానులను తనపైకి దాడికి ప్రోత్సహించారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనకు ఏం జరిగినా దానికి పవనే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా పోసాని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా పవన్ కల్యాణ్ పై తాను రేపు పోలీసు కేసు పెట్టనున్నట్లుగా కూడా పోసాని సంచలన కామెంట్ చేశారు. అంటే.. పీకే వర్సెస్ పోసాని వివాదం బుధవారం నాడు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కనుందన్న మాట. మరి ఈ వివాదం ఏ మేర ఉద్రిక్త పరిస్థితులను సృష్టిస్తుందో చూడాలి.
Must Read ;- జగన్‌పై పోరుకు పీకే రెడీ











