ఏపీలో సుధీర్ఘంగా సాగిన స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రజలను అయోమయానికి, ఆందోళనకు గురి చేశాయి. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో ఎలాగోలా ఒకే విడతలో పూర్తి అయినా.. పరిషత్ ఎన్నికలు మాత్రం సినిమా సిత్రాలను తలపించాయి. పంచాయతీ, మునిసిపల్ ఎన్నికల కంటే ముందే ప్రారంభమైనా.. చివరాఖరున ముగిశాయి. పరిషత్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకున్నామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ సర్కారు తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే టీడీపీ తనదైన మార్కు విశ్లేషణతో వైసీపీకి దిమ్మతిరిగే సమాధానం చెప్పగా.. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిషత్ ఎన్నికలతో పాటుగా మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలపై అదిరిపోయే విశ్లేషణను వినిపించారు. ఈ విశ్లేషణలో జగన్ పార్టీ దుర్మార్గాలను ప్రస్తావిస్తూనే.. జనసేన క్రమంగా ఎదుగుతున్న తీరును పవన్ కళ్లకు కట్టారు.
బింధువుగా మొదలై సింధువుగా మారి..
జనసేన నామమాత్రపు పోటీ ఇస్తుందన్న వాదనలు పటాపంచలు చేసిన వైనాన్ని పవన్ విస్పష్టంగా వెల్లడించారు. తన పార్టీ ప్రస్థానాన్ని ఆయన బింధువుగా సింధువుగా మారిందంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు సృష్టించినా పరిషత్ ఎన్నికల్లో బలంగా పోరాడామని.. ఏకంగా 25.2% ఓట్లు సాధించామని పీకే చెప్పారు. ఈ ఫలితాలు నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందాన్ని కలిగించాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ ఏమన్నారంటే.. ‘‘పరిషత్ ఎన్నికలు నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకూ జరిగిన విధానం చాలా బాధ కలిగించింది. ఒక వైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి కంకణం కట్టుకున్నామని మాటలు చెప్పిన ప్రభుత్వం… మరో వైపు ప్రతిపక్షాలను ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయకుండా బెదిరింపులు, దాడులకు పాల్పడింది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ జనసేన నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు బలంగా నిలిచారు. ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమై… మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1209 సర్పంచులు, 1576 ఉపసర్పంచులు, 4456 వార్డు సభ్యులు గెలిచాం. అలాగే నిన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది 1200 స్థానాలు. గెలుపొందింది 177. మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు మా పార్టీ మద్దతుతో గెలిచారు. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 24 శాతం పైచిలుకు ఓట్ల శాతం సాధిస్తే… పరిషత్ ఎన్నికల్లో 25.2 శాతం ఓట్లు వచ్చాయి. పోటీ చేసిన స్థానాలు గెలుపొందిన స్థానాలను ప్రాతిపదికన తీసుకొని ఈ విషయం చెబుతున్నాం. ఇక జెడ్పీటీసీ స్థానాల్లో రెండు స్థానాల్లో మా అభ్యర్థులు గెలిచారు. ఈ ఫలితాలు గొప్ప మార్పునకు సూచనగా భావిస్తున్నాం. పవర్ పాలిటిక్స్, అవకాశవాద రాజకీయాలు రాజ్యమేలుతున్న ఇలాంటి పరిస్థితుల్లో సైద్ధాంతిక సూత్రాలకు నిలబడి సాధించిన ఈ విజయం బలమైన మార్పుకు సంకేతం. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా తక్కువ స్థానాలే గెలిచింది. కానీ ఆ గెలుపు మార్పుకు సంకేతం. ఈ రోజు వాళ్లే తెలంగాణలో విజయబావుట ఎగరవేశారు. మార్పు చాలా చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఈ రోజు మా జనసేన విజయం చిన్నదిగానే కనిపించవచ్చు. కానీ సంపూర్ణ మార్పుకు ఇది బలమైన పాదముద్ర’’ అని పవన్ పేర్కొన్నారు.
జగన్ పాలనపై తీవ్ర వ్యాఖ్యలు
ఎన్నికల్లో వైసీపీ సర్కారు అవలంభించిన తీరుపై పవన్ మండిపడ్డారు. ఇలాంటి దాష్టికపు పాలన మన దేశంలో ఎక్కడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ పాలనపై పవన్ ఏమన్నారంటే.. ‘‘ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధికి ఓటు వేయకపోతే ఫించన్ నిలిపివేస్తాం, రేషన్ కట్ చేయిస్తాం, ఇళ్ల స్థలాలు నిలిపివేస్తామంటూ వాలంటీర్లతో బెదిరించారు. ఇతర పార్టీల అభ్యర్ధుల ఆర్థిక మూలలపై దాడులు చేశారు. మరి కొన్నిచోట్ల స్వయంగా మంత్రులే ఎన్నికల ప్రక్రియను నడిపించడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తూ నిలబడిపోయింది. రాష్ట్రంలో వైసీపీది దౌర్భాగ్యపు… దిక్కుమాలిన… ఇలాంటి దాష్టికపు పాలన మన దేశంలో ఎక్కడా లేదు. పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ప్రత్యర్ధులపై దాడులు చేసి బెదిరింపులకు దిగారు. వైసీపీ దాష్టిక పాలన చూసి ఓపిక నశించింది. 151 మంది గెలిచారు. మంచి పాలన అందిస్తారని అనుకున్నాం కానీ దాడులు, బెదిరింపులతో పాలన చేస్తున్నారు. వారి దాష్టిక పాలను ఎదుర్కోవాలని బలంగా నిర్ణయించుకున్నాం. వారి దాడులను ఎలా ఎదుర్కోవాలి… క్షేత్రస్థాయి పోరాటాలకు ఎలా సిద్ధమవ్వాలనే దానిపై ఈ నెల 27, 28 తేదీల్లో విజయవాడలో మా నాయకులతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తాం. ఇక నుంచి ప్రతి జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటనలు జరిపి ప్రజల పక్షాన నిలబడతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం’’ అని పవన్ పేర్కొన్నారు. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల విశ్లేషణలో పవన్ అదరగొట్టేశారనే చెప్పాలి.
Must Read ;- టీడీపీకి నో ఎంట్రీ.. వైసీపీకి రెడ్ కార్పెట్











