Janasena Lost Political Party Recognition :
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేనకు ఇప్పుడు నిజంగానే కొత్త కష్టం వచ్చి పడింది. జనంలో క్రమంగా బలం పెంచుకుంటున్న జనసేనకు ఈ కష్టం నిజంగానే అశనిపాతంలా మారిందని కూడా చెప్పాలి. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసిన జనసేన.. సింగిల్ సీటుకే పరిమితమైపోయిన సంగతి తెలిసిందే. అదే సమయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బరిలో నిలిచిన రెండు చోట్లా ఓటమిపాలయ్యారు. జనసేనకు పడిన ఓట్ల శాతం కూడా చాలా తక్కువేనని చెప్పాలి. ఇలాంటి క్రమంలో ఆ పార్టీకి దక్కిన ఓట్లు, సీట్ల సంఖ్యను బేరీజు వేసిన కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పుడు ఆ పార్టీకి షాకిచ్చేలా సంచలన నిర్ణయం ప్రకటించింది. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీల జాబితా నుంచి జనసేనను తొలగించింది. ఈసీ తీసుకున్న ఈ నిర్ణయంతో జనసేనకు కేటాయించిన గాజు గ్లాస్ కూడా రద్దైపోయినట్టే లెక్క. ఇకపై జనసేన ఏ ఎన్నికల్లో పోటీ చేసినా.. ఒక్కో స్థానానికి ఒక్కో గుర్తు దక్కుతుంది. ఈ పరిణామం నిజంగానే జనసేనకు షాకిచ్చేదే కదా.
స్థానిక పోరులో సత్తా చాటినా..
ఏపీలో ఇటీవలే ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన సత్తా చాటిందనే చెప్పాలి. తమకు బలమున్న స్థానాల్లో పోటీ చేసిన జనసేన.. రెండు జడ్పీటీసీలతో పాటు 177 ఎంపీటీసీలను కూడా దక్కించుకుంది. చాలా చోట్ల జనసేన అభ్యర్థులు ఎంపీపీల ఎన్నికలో కీలకంగా మారిపోయారు. తూర్పు గోదావరి జిల్లా కడియం ఎంపీపీని టీడీపీకి ఇచ్చేసిన జనసేన అధికార పార్టీ వైసీపీకి ఝలక్ ఇచ్చింది. గుంటూరు జిల్లా దుగ్గిరాలలోనూ జనసేన దక్కించుకున్ని సింగిల్ ఎంపీటీసీ సీటు అక్కడి వైసీపీ శ్రేణులను తీవ్రంగానే దెబ్బ కొట్టేసింది. మునిసిపల్ ఎన్నికల్లో అంతగా రాణించని జనసేన.. పంచాయతీ ఎన్నికల్లో మాత్రం వెయ్యికి పైగానే సర్పంచ్ పదవులను దక్కించుకుంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 25 శాతానికి పైగా ఓట్లను సాధించామని జనసేనాని పవన్ కల్యాణ్ ఘనంగా ప్రకటించుకున్నారు. అంతేకాకుండా ఇకపై ఏ ఎన్నిక జరిగినా జనసేన కీలకంగా మారనుందని, ఎన్నికల ఫలితాల్లో కీలకంగా మారనున్నామని కూడా పవన్ ధీమాగానే చెప్పుకొచ్చారు.
ఈసీ దెబ్బతో ఎన్నెన్ని కష్టాలో..
జనంలో పార్టీ తన బలాన్ని పెంచుకుంటున్న తరుణంలో ఈసీ తీసుకున్న నిర్ణయం జనసేనకు తీవ్రంగానే ఇబ్బంది పెట్టేలానే ఉంది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి సాగుతున్న జనసేన.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి తిరిగి టీడీపీతో దోస్తీ కట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. అదీ కుదరకుంటే.. సింగిల్ గానే జనసేన బరిలోకి దిగాలని కూడా యోచిస్తోంది. అయితే ఇప్పుడు సింగిల్ గా బరిలోకి దిగే అవకాశాలు జనసేనకు మృగ్యమయ్యాయనే చెప్పాలి. ఎందుకంటే.. జనసేన అభ్యర్థులు ఎక్కడ బరిలోకి దిగినా.. వారికి ఒకే గుర్తు మాత్రం రాదు. జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగినా.. ఆయా అభ్యర్థులను స్వతంత్ర అభ్యర్థులుగానే ఈసీ గుర్తిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కో చోట జనసేన పార్టీ అభ్యర్థులకు ఒక్కో గుర్తు వస్తుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే.. జనసేన ఏదో ఒక పార్టీతో జట్టు కట్టే ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ తరహా పరిస్థితి పార్టీని మరింతగా దిగజార్చే ప్రమాదం లేకపోలేదన్న విశ్లేషణలు సాగుతున్నాయి,
Must Read ;- టీడీపీ వెంటే జనసేన.. కడియం రిజల్టే సాక్ష్యం











