తెలంగాణలో ధాన్యానికి మద్దతు ధర అంశంపై వివాదం రాజుకుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్లే ధాన్యం రైతులకు మద్దతు ధరకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేక పోతున్నామని తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకు మించి ఒక్కరూపాయి కూడా ఇవ్వవద్దని కేంద్రం ఆదేశించిందటూ ఆయన ఓ లేఖను విడుదల చేశారు. ఆ లేఖలో ఎక్కడా మద్దతు ధర కన్నా ఎక్కువ ఒక్క రూపాయి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వవద్దని కేంద్రం చెప్పలేదు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర కన్నా కొన్ని రాష్ట్రాలు రైతులను ప్రోత్సహించేందుకు బోనస్‌లు, ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి. అవి ఎంత ఇవ్వాలనేది రాష్ట్రాలు నిర్ణయించుకుంటాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మద్దతు ధర ఎంత ప్రకటించారో అంతవరకు కేంద్రం చెల్లిస్తుంది. ఆ తరవాత అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు బోనస్ రూపంలో ఎంత ఇచ్చినా ఆ మొత్తం మాత్రం తెలంగాణ భరించాలని మాత్రమే కేంద్రం లేఖలో సూచించింది. అయితే తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు మాత్రం మద్దతు ధరకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వడానికి కేంద్ర ఒప్పుకోవడం లేదనే అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలం అయిందని విమర్శలు చేస్తూ, బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తున్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. కేంద్రం పంపిన లేఖను వెనక్కు తీసుకునేలా కిషన్‌రెడ్డి కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం వల్లే…
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే రైతులకు మద్దతు ధరకు మించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేకపోతున్నామని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు కొత్త వాదన తీసుకు వచ్చారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పంపిన లేఖను మీడియాకు విడుదల చేశారు. అయితే ఆ లేఖలో ఎక్కడా మద్దతు ధర కన్నా ఎక్కవ ధర ఇవ్వవద్దని కేంద్రం చెప్పకపోవడం గమనార్హం. ఈ ఏడాది సెప్టెంబర్ 17న ధాన్యం మద్ధతు ధర కంటే రైతుకు ఒక్క రూపాయి ఇచ్చినా రాష్ట్రం నుంచి ధాన్యం, బియ్యం సేకరించేది లేదని కేంద్రం రాష్ట్రాలకు లేఖ పంపిందని హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా గాని, ప్రత్యక్షంగా గాని మద్ధతు ధర కంటే ఒక్క రూపాయి అదనంగా ఇచ్చినా, ధాన్యం తీసుకునేది లేదని రాష్ట్రాన్ని హెచ్చరిస్తూ కేంద్రం లేఖలో స్పష్టం చేసిందని హరీష్ రావు తెలిపారు.
తెలంగాణలో భారీగా పెరిగిన ధాన్యం దిగుబడి
తెలంగాణలో గత రెండేళ్లుగా ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. రాష్ట్ర అవసరాలకన్నా మూడింతలు పెరిగింది. తెలంగాణలో ఖరీఫ్‌లో 87 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. రాష్ట్ర అవసరాలకు 26 లక్షల టన్నులు సరిపోతాయి. మిగిలిన ధాన్యం కేంద్రం తీసుకోకుంటే తాము ఏం చేయాలని హరీష్ రావు వాదనగా ఉంది.
కేంద్రం లేఖలో ఏముంది
కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాల నుంచి ఎంత ధాన్యం సేకరిస్తుందో ముందే చెబుతుంది. ఆయా రాష్ట్రాల్లో పండే పంటలు, ఉత్పత్తిని బట్టి వేర్వేరుగా ఉంటాయి. తెలంగాణలో ఎంత ధాన్యం లెవీగా సేకరించాలో కేంద్రం ఏటా ముందే ప్రకటిస్తుంది. లెవీ పూర్తయ్యే వరకూ కేంద్రం మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేస్తుందని లేఖలో వెల్లడించారు. అయితే లెవీ పూర్తయిన తరవాత ధాన్యం సేకరణను కేంద్రం నిలిపి వేస్తుంది. ఆయా రాష్ట్రాల్లో ఉండే అవసరాలు, నిల్వ సదుపాయాలను బట్టి లెవీగా ఎంత ధాన్యం సేకరించాలనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది.
ఏం చేయాలి?
తెలంగాణలో రెండు సంవత్సరాలుగా కాళేశ్వరం జలాలు అందుబాటులోకి వచ్చాయి. రైతులంతా వరి సాగు చేస్తున్నారు. గతంలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చేవి. రెండేళ్లుగా తెలంగాణలో దాదాపు 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తున్నాయి. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం లెవీ సేకరణ పెంచేలా, తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుకోవాలి. కేంద్రం సదుపాయాలు పరిశీలించి లెవీ సేకరణ స్థాయిని పెంచుతారు. దీని ద్వారా రైతులు పండించిన పంటలో దాదాపు 70 శాతం లెవీ సేకరణకు వెళ్లే అవకాశం దక్కుతుంది. మిగిలిన ధాన్యాన్ని ప్రయివేటు వ్యాపారులు కొనుగోలు చేస్తారు. స్థానిక అవసరాలకు కూడా 30 శాతం దిగుబడులు అవసరం అవుతాయి. ఇవన్నీ రెండు, మూడు సంవత్సరాల ముందస్తు ప్రణాళికతో చేసుకోవాల్సిన పనులు. తీరా ధాన్యం మార్కెట్లకు వచ్చాక గిడ్డంగులు లేవని ప్రభుత్వాలు ఒకరిపై ఒకరి మాటల యుధ్దం చేసుకుంటే నష్టపోయిది మాత్రం మట్టిని నమ్ముకున్న రైతులే.











