కరోనా మహమ్మారి ఒక్కసారిగా ప్రపంచాన్ని వణికించేసిన విషయం తెలిసిందే. దానివల్ల చాలాకాలం పాటు ఎక్కడి పనులు అక్కడ ఆగిపోవడమే కాదు ప్రయాణాలు సైతం వాయిదాపడ్డాయి. ఎట్టకేలకు కొద్ది రోజుల క్రితమే ప్రభుత్వాలు వెసులుబాటు కల్పిస్తూ అన్ లాక్ ప్రక్రియకు పచ్చజెండా ఊపడంతో అన్ని రంగాలలో పనులు పునః ప్రారంభమయ్యాయి. భారతీయ చిత్రరంగంలోని వివిధ భాషలకు చెందిన షూటింగులను తిరిగి మొదలుపెట్టారు. ఇప్పుడిప్పుడే తారలు కూడా వెకేషన్స్ ను ఎంజాయ్ చేసేందుకు మాల్దీవులు, గోవా వంటి ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు.
ఇటీవల మాల్దీవులలో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ తారలు సేదతీరిన సంగతి తెలియంది కాదు. తాజాగా కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ ఉల్లాసంగా గడపాలని పలువురు తారలు గోవాను హాలిడే, జాలీడే స్పాట్ గా ఎంచుకుని అక్కడికి వెళ్లిపోయారు ఆలా వెళ్లిన వారిలో టాలీవుడ్ తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ తారలు ఎందరో ఉన్నారు. ఇటీవలే నాగచైతన్య, సమంత దంపతులు గోవాకు వెళ్లి సందడి చేస్తున్న నేపథ్యంలోనే కొత్త ఏడాది వస్తుండటంతో ఆ వేడుకులను వారు అక్కడే జరుపుకుంటున్నారు..పలువురు స్నేహితులతో కలసి విందు, వినోదాలలో పాల్గొంటూ సరదాగా గడిపేస్తున్నారు. ఇంకా క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, త్రిధా చౌదరి, అక్షర గౌడ వంటి చాలామంది తారలు గోవాలో గురువారం ఉదయం నుంచే కొత్త ఏడాది సంబరాలను మొదలు పెట్టేశారు.