మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ మూవీని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి లూసీఫర్ రీమేక్, వేదాళం రీమేక్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. ఓ వైపు ఆచార్య, మరో వైపు లూసీఫర్ స్టోరీ సిట్టింగ్స్ లో బిజీగా ఉన్న చిరంజీవి ఆహా కోసం సామ్ జామ్ షోలో పాల్గొన్నారు. సమంత నిర్వహిస్తున్న ఈ టాక్ షోలో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. ఇందులో తన పెళ్లికి ముందు జరిగిన ఓ సంఘటనను ఈ షోలో పంచుకున్నారు.
ఇంతకీ అది ఏంటంటే.. శంకరాభరణం సినిమాలో నటించిన మంజుభార్గవి చిరంజీవితో కోతలరాయుడు సినిమాలో నటించింది. ఆ పరిచయంతో మంజుభార్గవి శంకరాభరణం ప్రిమియర్ షోకు చిరంజీవిని ఆహ్వానించిందట. అప్పటికి చిరంజీవికి పెళ్లి కాలేదట. ఆయన అల్లు రామలింగయ్య ఫ్యామిలీతో కలిసి ప్రిమియర్ షోకు వెళ్లారట. క్లైమాక్స్ లో కన్నీళ్లు ఆగకపోవడంతో.. లైట్స్ ఆన్ చేస్తే ఎవరికైనా తెలిసిపోతుందనే ఉద్దేశ్యంతో చిరంజీవి కర్చీఫ్ కోసం వెతుకుతుంటే.. మంజు భార్గవి తుడుచుకోమని తన చీర కొంగు అందించిందట. సరిగ్గా చిరంజీవి.. మంజు భార్గవి చీర కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటుంటే లైట్స్ ఆన్ అయ్యాయట.
అప్పుడు తన చేతిలో ఉన్న మంజుభార్గవి చీర కొంగు చూసి ఏమనుకున్నారో అని టెన్షన్ పడ్డారట చిరు. ఆతర్వాత కొన్నాళ్లకు పెద్దలు సురేఖతో పెళ్లి కుదర్చడం జరిగిందని.. అయితే.. శంకరాభరణం ప్రిమియర్ షోలో తన చేతిలో మంజుభార్గవి చీర కొంగు ఉండడం సురేఖ చూసిందేమో అని.. పెళ్లికి ఒప్పుకోదని అనుకున్నాను కానీ.. సురేఖ పెళ్లికి ఒప్పుకోవడంతో హమ్మయ్యా అనుకున్నాను అని చెప్పారు చిరంజీవి. నాటి సంఘటనను నేడు ఆహాలో సామ్ జామ్ టాక్ షోలో గుర్తుచేసుకున్నారు మెగాస్టార్. ఇదే కాకుండా మరిన్ని ఆసక్తికరమైన విషయాలను చిరు ఈ షోలో పంచుకోవడం విశేషం.
Must Read ;- చిరు సినిమాలను.. మహేష్, పవన్, ఎన్టీఆర్ రీమేక్ చేస్తే..?