సుప్రీంకోర్టు… దేశ సర్వోన్నత న్యాయస్థానం. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షలు రద్దు చేస్తూ దాదాపుగా అన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రీయ సంస్థలు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ కూడా ఇదే బాట నడిచాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో పడిన ఓ పిటిషన్ ను విచారించిన అపెక్స్ కోర్టు అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఏపీ నుంచి నిర్ణీత వ్యవధిలోగా కౌంటర్ దాఖలు కాలేదు. దీనికి కారణం ఏమిటి?
హైకోర్టు… రాష్ట్ర స్థాయిలో సర్వోన్నత న్యాయస్థానం. రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే కోర్టు పేర్కొన్న నిర్ణీత వ్యవధిలోగా కౌంటర్లు దాఖలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతూనే ఉంది. వెరసి హైకోర్టు నుంచి జగన్ ప్రభుత్వానికి మొట్టికాయలు పడుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి?
ఇక రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ఇటీవల చాలా కీలకమైన నిర్ణయాలే జరుగుతున్నాయి. వీటికి సంబంధించి పకడ్బందీ కార్యాచరణ లోపించిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు నుంచి అనుమతులు సాధించే క్రమంలో కేంద్రానికి సవివర నివేదికలు ఎప్పటికప్పుడు పంపాలి. అయితే ఈ పని కూడా సకాలంలో జరగడం లేదు. వెరసి కేంద్రం నుంచి కూడా జగన్ సర్కారుకు శ్రీముఖాలు అందుతూనే ఉన్నాయి. దీనికి కారణం ఏమిటి?
ఈ అన్ని అంశాలకు కారణం ఒక్కటే. అధికారుల పనితీరులో లోపించిన వేగమే. అసలే కొత్త రాష్ట్రం. ఆపై అరకొర వసతులతోనే అమరావతిలో పాలన ప్రారంభించాల్సి వచ్చింది. క్రమేణా వసతులు పెరుగుతూ వచ్చినా.. పనిలో మాత్రం వేగం పెరగలేదు. అవసరమైన సమయంలో అందిన *ఫైవ్ డేస్*ను ఉద్యోగులు ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. పని చేసిన ఐదు రోజుల్లో అయినా సక్రమంగా సీట్లలో కూర్చుంటున్నారా? అంటే… అదీ లేదు. హైదరాబాద్ నుంచి రోజూ జర్నీలు చేస్తుండటంతో ఆలస్యంగా కార్యాలయాలకు వస్తున్నారు. గంట మూడు కొట్టంగానే సీట్లలోంచి మాయమవుతూ హైదరాబాద్ చెక్కేస్తున్నారు. ఇక శని, ఆదివారాలకు అదనంగా సెలవు వచ్చిందంటే.. మరో రెండు, మూడు రోజులు సెలవు పెట్టేస్తూ.. వారం మొత్తం ఆఫీసులకు దూరంగానే ఉంటున్నారు. ఇదంత పాలకులకు తెలిసినా.. ఉద్యోగులను అదిలించడానికి భయపడుతున్న జగన్ సర్కారు.. ఫైవ్ డేస్ హనీమూన్ ను పొడిగిస్తూనే పోతోంది. వెరసి రాష్ట్ర ప్రభుత్వ పాలన కుంటుపడుతోంది.
‘ఐదు రోజుల’కు ఐదేళ్లు…
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత 13 జల్లాలతో కొత్తగా ప్రయాణం మొదలెట్టిన నవ్యాంధ్రప్రదేశ్ కు రాజధాని కూడా లేకుండాపోయింది. అయితే అన్ని జిల్లాలకు మధ్యలో ఉండేలా అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని ఏపీ సర్కారు… పాలనను కూడా అక్కడి నుంచే ప్రారంభించింది. అయితే ఉన్నపళంగా ఉద్యోగులంతా హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చి అక్కడే స్థిరపడేందుకు కొంత సమయం పడుతుందన్న వాస్తవాన్ని గ్రహించిన నాటి టీడీపీ సర్కారు… సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలకు చెందిన ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అమరావతిలో రాజధాని నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో పలుమార్లు ఈ విధానాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ పని విధానానికి అప్పుడే ఐదేళ్లు నిండిపోయాయి. అయినా కూడా ఇప్పటికీ ఈ పని విధానాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ జగన్ సర్కారు శనివారం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు రేకెత్తుతున్నాయి.
ఇప్పటికీ హైదరాబాద్ నుంచే రాకపోకలు
చంద్రబాబు హయాంలో తొలుత హైదరాబాద్ నుంచి ఉన్నపళంగా వచ్చిన నేపథ్యంలో వసతుల లేమి, కుటుంబాలను అప్పటికప్పుడు తరలించడం కుదరలేదు. వెరసి ఐదు రోజుల పని విధానంపై అంతగా వ్యతిరేకత రాలేదు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సచివాలయంతో పాటు దాదాపుగా అన్ని శాఖాధిపతుల కార్యాలయాలకు భవనాలు చంద్రబాబు హయాంలోనే సమకూరాయి. ఇక ఇప్పుడు జగన్ ఏకంగా అమరావతిని ఎత్తేసి… విశాఖలో పాలనను మొదలెడతానంటూ సంచలన ప్రకటనలు చేస్తున్నారు. అంటే.. అమరావతి నుంచి విశాఖకు పరుగులు పెట్టాల్సిన సమయం వచ్చిందన్న మాట. అయినా కూడా ఉద్యోగుల్లో మెజారిటీ శాతం ఇంకా హైదరాబాద్ నుంచే అమరావతికి రాకపోకలు సాగిస్తున్న వైనంపై సర్వత్రా విమర్శలు రేకెత్తుతున్నాయి. ఈ విషయం తెలిసి కూడా ఉద్యోగులకు కఠిన ఆదేశాలకు భయపడుతున్న జగన్ సర్కారు… మరో ఏడాది పాటు ఐదు రోజుల పని విదానాన్ని పొడిగిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.