ఏపీలో జగన్ సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై బాధ్యత కలిగిన విపక్షంగా తెలుగు దేశం పార్టీ తనదైన శైలి నిరసనలతో హోరెత్తిస్తోంది. ఇందులో భాగంగా పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు పార్టీకి చెందిన కీలక నేతలంతా యావత్తు రాష్ట్రాన్ని నిరసనలతో హోరెత్తించారు. ఈ నిరసనల్లో ఒక్కో నేత ఒక్కో రీతిన తమదైన శైలి వినూత్న నిరసనలకు దిగారు. ఈ నిరసనల్లో పార్టీ కీలక నేతలతో పాటుగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాలుపంచుకున్నాయి. పార్టీకి చెందిన ఒక్కో నేత ఒక్కోరీతిన నిరసన తెలపగా.. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చేపట్టిన నిరసన అందరినీ ఆకట్టుకుంది.
బైక్ కు అంతిమయాత్ర
సెంచరీ దాటేసిన పెట్రోల్, వెయ్యికి చేరువైన గ్యాస్ ధరలపై హోరెత్తిన ఈ నిరసనల్లో పార్టీ కీలక నేత, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తనదైన శైలి నిరసన చేపట్టారు. ఒంగోలు కేంద్రంగా చేపట్టిన ఈ నిరసనలో దామచర్ల.. ఓ మోటార్ సైకిల్ కు అంతిమ యాత్ర చేపట్టారు. మనిషి చనిపోతే.. మృతదేహానికి ఎలాగైతే దండలు వేసి పాడెపై పెట్టి అంతిమ యాత్ర ఎలాగైతే నిర్వహిస్తారో.. బైక్ కు కూడా హ్యాండిల్ కు దండలేసి.. దానిని పాడెపైకి ఎక్కించి.. దానిని శ్మశానానికి మోసుకెళుతున్నట్టుగా ఈ నిరసన ప్రదర్శన కొనసాగించారు. పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో బైక్ నెఉ మెయింటైన్ చేయడం కష్టతరంగా మారిందని, అందుకే దానికి అంతిమ యాత్ర చేస్తున్నట్టుగా దామచర్ల చెప్పారు. ఈ నిరసన సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
నిమ్మల కూడా ఇలాగే..
గతంలో రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై టీడీపీ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. వారం, పది రోజుల తరబడి వరుసబెట్టి టీడీపీ కొనసాగించిన నిరసనల్లో రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై బట్టబయలైన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో భాగొంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తనదైన వినూత్న నిరసన చేపట్టారు. ఓ రోడ్డుపై లోతైన గుంత ఏర్పడగా.. అందులో గేలం వేసి చేపలు పట్టిన నిమ్మల నిరసన రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారింది. నాడు నిమ్మల చేపట్టిన వినూత్న నిరసన మాదిరే ఇప్పుడు దామచర్ల కూడా పెట్రోల్ ధరలపై వినూత్నంగా నిరసన చేపట్టారు.
Must Read ;- వైసీపీని వీడి.. టీడీపీ వైపుగా దళితులు











