ఒకవైపు కరోనా సెకండ్ వేవ్.. మరోవైపు లాక్ డౌన్ కారణంగా సామాన్యుల బతుకు భారంగా మారింది. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడంతో పస్తులు ఉండే పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే ఆర్థిక భారంతో జీవితాలు నెట్టుకొస్తున్న సామాన్యులపై మరో పిడుగు పడింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలతో సతమతమవుతుంటే.. కొత్తగా గ్యాస్ ధరల పెంపు సామాన్యుల పాలిట శాపంగా మారింది. వంట గ్యాస్ ధరలను మరింత పెంచుతున్నట్లు సంస్థలు ప్రకటించాయి. 14.2 కిలోగ్రాముల సిలిండర్‌పై రూ.25.50, కమర్షియల్ సిలిండర్ ధరను రూ. 84 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది. ఈ ధరలు జూలై 1 నుంచే అమల్లోకి రానున్నాయి.
తాజా పెంపుతో..
గత ఆరు నెలల్లో వంట గ్యాస్ ధరలు రూ.140 లకు పెరిగింది. తాజాగా ఈ నిర్ణయంతో దేశరాజధాని ఢిల్లీలో 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 834కు చేరుకుంది. కోల్‌కతాలో రూ. 861, ముంబైలో రూ. 834.5, చెన్నైలో రూ. 850కి చేరుకుంది. ఇక 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర విషయానికొస్తే దీని ధర 84 రూపాయలు పెరగడంతో, ఢిల్లీలో దీని ధర రూ. 1,550కు చేరుకుంది. కోల్‌కతాలో రూ.835.5, ముంబైలో రూ. 809, చెన్నైలో రూ. 825కు చేరుకుంది.
సామాన్యులు విలవిల
ఇప్పటికే కరోనా కారణంగా ఎంతోమంది పేదలు రోడ్డునపడ్డారు. వ్యాపార కార్యకాలాపాలకు అంతరాయం కలగడంతో, ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఇవన్నీ చాలవనట్టుగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను అమాంతం పెంచింది. ఇప్పటికే చాలా చోట్లా ధరలు సెంచరీ కొట్టాయి. ఫలితంగా నిత్యావసర, ఇతర ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో భారమైన జీవితాలు నెట్టొకొస్తున్న సామాన్యులకు.. గ్యాస్ బండ గుదిబండలా మారనుంది.
Must Read ;- వడ్లు అమ్మటానికి అష్ట కష్టాలు.. అమ్మినా డబ్బులందక రైతుల గగ్గోలు










