క్రీడలు, రాజకీయాలు, కళారంగం, సామాజికవేత్తలు… ఇలా వివిధ రంగాలలో తమ ప్రతిభ పాటవాలతో అవతలి వారికి ఆదర్శంగా నిలచిన ధీర వనితలను ఎంచుకుని ఈ జాబితాలో స్థానం కల్పిస్తుంది బిబిసీ. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 100 మంది మహిళలకు మాత్రమే చోటు దక్కుతుంది. మరి 2020 ఏడాదికి గాను విడుదల చేసిన ప్రపంచ వ్యాప్త 100 మహిళల లిస్ట్ లో, నలుగురు భారతీయ మహిళలకు చోటుదక్కడం విశేషం.
బిల్కిస్ బానో…
భారతీయ పౌరసత్వ సవరణ చట్టం, ఈ సవరణ బిల్లు దేశంలో ఎంతటి ఉద్రిక్తలకు దారితీసిందో అందరికీ తెలుసు. అటువంటి హింసాత్మక చర్యల మధ్య శాంతియుతంగా పోరాటం చేసి అందరి దృష్టిని ఆకర్షించింది ఈ 82 సంవత్సరాల బామ్మ. భారతీర పౌరసత్వ సవరణ చట్టం ను వ్యతిరేకిస్తూ, గడ్డకట్టించే చలిలో ఢిల్లీలోని షహీనా బాద్ లో ఉదయం 8 గంటలకు తన శాంతియుత పోరాటం మొదలు పెట్టి, అర్థరాత్రి వరకు అక్కడే నిరసన తెలిపింది. ఒక్క అడుగుతో మొదలై… క్రమంగా ప్రభంజనంగా మారింది. అదే ఆమెను అత్యంత ప్రభావవంతమైన మహిళగా నిలిబెట్టింది.
ఇసైవాణి…
తమిళనాడులో గానా పాటలు పాడే ఏకైక మహిళగా గుర్తింపు పొందింది ఇసైవాణి. గానా అంటే తమిళనాడులో మురికివాడల్లోని చావులకు పాడే పాటలుగా పేరుపొందాయి. ఇటీవలి కాలంలో వీటికి ఆదరణ పెరిగింది. కానీ ఈ పాటలు పాడడానికి మహిళలు ఆసక్తి చూపరు. అటువంటి మగవారి సామ్రాజ్యంలో తనకుంటూ ఒక గుర్తింపు సాధించిందీ లేడీ సింగర్.
రిధిమాపాండే…
‘మాకు పీల్చడానికి స్వచ్ఛమైన గాలిని మిగల్చండి’ అంటూ దేశ ప్రధానికే లేఖ రాసిందీ చిన్నారి. పర్యావరణాన్ని కాపాడడానికి చర్యలు చేపట్టండంటూ మోదీ పనితనాన్నే ప్రశ్నించి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. 9 ఏళ్ల వయసులోనే పర్యావరణానికి హాని కలిగిస్తున్నారంటూ దేశ ప్రధానులపైన ఐరాసలో ఫిర్యాదు చేసింది. ‘ఇండియన్ గ్రెటాతంబర్గ్’ గా పిలిచే రిధిమా 11 సంవత్సరాల వయసులోనే బిబిసీ అత్యంత ప్రభావవంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది.
మానసీజోషి…
రోడ్డు ప్రమాదంలో కాలు పొగొట్టుకుంది. అదే ఇంకొకరైతే బాధపడుతూ చక్రాల కుర్చీకే పరిమితమయ్యే వారేమో. కానీ మానసీ అలా చేయలేదు. తన పట్టుదలతో పారా బ్యాడ్మింటన్ లో ప్రపంచ ఛాంపియన్ గా గెలిచి అందరికీ ఆదర్శంగా నిలిచింది. టైమ్ మ్యాగజైన్ లో ముఖ చిత్రంగా ప్రచురితమవడంతో పాటు ‘నెక్స్ జనరేషన్ లీడర్’ గా నిలచింది.